
ఆ తీర్పుపై పునఃసమీక్ష లేదు
‘స్వలింగ సంపర్కం’పై సుప్రీంకోర్టు
కేంద్రం, పలు సంఘాల రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ గత డిసెంబర్‌లో వెలువరించిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ హెచ్‌ఎల్ దత్తూ, జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. గతంలో తాము వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఏమాత్రం కనిపించడం లేదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పును గత డిసెంబర్ 11న సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. స్వలింగ సంపర్కం భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377 ప్రకారం నేరమని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా స్పష్టం చేసింది. అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవారికి గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని, అప్పటివరకు స్వలింగ సంపర్కం నేరంగానే పరిగణించాలని తెలిపింది. దీనిపై స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరసన తెలిపాయి.
ఇది తిరోగమన తీర్పు అంటూ కేంద్ర మంత్రులు సైతం అసంతృప్తి వ్యక్తంచేశారు. చివరికి ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వం, స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు, నాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓతో పాటు బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనగల్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. అప్పటిదాకా రహస్యంగా ఉన్న స్వలింగ సంపర్కులు తమ గుర్తింపును బయటపెట్టుకున్నారని, ఇప్పుడు వారంతా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాజ్ పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.
సుప్రీం తీర్పు వారి ప్రాథమిక హక్కులకు భంగకరమని వాదించింది. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ధర్మాసనం తాజాగా విచారణ (ఇన్ చాంబర్) జరిపింది. ‘‘పిటిషన్లను పరిశీలించాం. అనుబంధ పత్రాలను చదివాం. కోర్టు గతంలో వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. అందువల్ల వీటిని కొట్టివేస్తున్నాం’’ అని తెలిపింది. తమ వాదనను మౌఖికంగా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది.