
విషమంగానే మహానటుడి ఆరోగ్యం
బాలీవుడ్ మహానటుడు దిలీప్ కుమార్(94) ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉన్నట్లు లీలావతి ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ముంబై: బాలీవుడ్ మహానటుడు దిలీప్ కుమార్(94) ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉన్నట్లు లీలావతి ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. డీహైడ్రేషన్‌తోపాటు మూత్రసంబంధిత ఇబ్బందులలో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు బుధవారం ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, దిలీప్ కిడ్నీలు కూడా చెడిపోయినట్లు వైద్యులు గుర్తించారని కొన్ని జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
అలనాటి నటి, దిలీప్ కుమార్ సతీమణి సైరాబాను శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘ అభిమానుల ప్రార్థనల మేరకైనా ఆయన తిరిగి కోలుకుంటార’నే ఆశాభావం వ్యక్తం చేశారు. వృధ్దాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్న దిలీప్.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
‘ట్రాజెడీ కింగ్’గా గొప్ప పేరు తెచ్చుకున్న దిలీప్ కుమార్ అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్. అందాజ్, మధుమతి, ఆన్, దేవ్‌దాస్, మొఘల్ ఏ ఆజం, గంగా జమున, క్రాంతి, కర్మా తదితర చిత్రాలలో తనదైన నటనను ప్రదర్శించారు. 1998లో వచ్చిన ఖలీ.. దిలీప్ నటించిన చివరి సినిమా. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారంతోపాటు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది.