దుమ్మురేపుతున్న డీజే.. రికార్డు కలెక్షన్స్!
అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ’ డీజే దువ్వాడ జగన్నాథం’ కు అంత గొప్పగా రివ్యూలు రాలేదు. డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుండటం అటు విమర్శకులను, ఇటు సినీ పండితులను విస్మయానికి గురిచేస్తున్నది.
నెగిటివ్ రివ్యూలు, యావరేజ్ మౌత్‌టాక్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించవచ్చునని భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ’డీజే’జోరు ఇది తప్పని ప్రూవ్ చేసింది. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరేరీతిలో రూ. 33 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. మొత్తానికి తొలివారం ముగిసేలోపే ‘డీజే’ వందకోట్ల మార్క్‌ను చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా తొలిరోజు వసూళ్లలో సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ ను అధిగమించడం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
‘డీజే’ బన్నీ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ‘గబ్బర్‌సింగ్’తో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న హరీశ్ శంకర్‌తో కలిసి బన్నీ చేసిన తొలి సినిమా ఇది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 3వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. రెండువారాలపాటు ఈ సినిమాకు గట్టిపోటీ లేకపోవడంతో రానున్న రోజుల్లోనూ ‘డీజే’ వసూళ్ల జోరుకు అడ్డులేకపోవచ్చునని భావిస్తున్నారు.