కడప ఉక్కు కర్మాగారాన్ని తరలించొద్దు: సీపీఐ నారాయణ
కడప రూరల్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న ఉక్కు కర్మాగారాన్ని వేరొక ప్రాంతానికి తరలిస్తే ఊరుకోబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. నారాయణ హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లాలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగారాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంకు తరలించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
'కడప ఉక్కు- రాయలసీమ హక్కు' నినాదంతో సోమవారం కడప పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ.. కర్మాగారం తరలింపు ఆలోచనను ప్రభుత్వాలు వెంటనే మానుకోవాలన్నారు. సమావేశంలో కడప ఎమ్మెల్యే అంజద్‌పాషా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, మానవ హక్కుల నేతలు పాల్గొన్నారు.