
భారత్-పాక్ పరిణామాలపై అగ్రరాజ్యం ఆరా!
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సీజన్ కొనసాగుతున్నప్పటకీ ఆ దేశ నాయకత్వం భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ గత రెండురోజుల్లోనే రెండుసార్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఈ అంశంపై ముచ్చటించారు. దాయాది పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలని భారత్‌కు అమెరికా సూచించింది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యపరంగా ఏకాకిని చేయడంతోపాటు పలురకాలుగా దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం నుంచి ఈ సూచన రావడం గమనార్హం.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. గత సోమవారం ఆమె పాకిస్థాన్ తీరును దుయ్యబడుతూ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో జాన్ కెర్రీ రెండుసార్లు సుష్మాతో మాట్లాడారని విశ్వసనీయ దౌత్య వర్గాలు తెలిపాయి. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం అమెరికా నాయకత్వం నేరుగా భారత్‌ను సంప్రదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా వీరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం.