
డాలర్ స్లిప్.. రుపీ అప్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత ప్రారంభ ఉపన్యాసంలో పన్ను కోతలు, ఇతర ఉద్దీపన వాగ్దానాల నేపథ్యంలో సోమవారం కరెన్సీ మార్కెట్ లో డాలర్ క్షీణించింది. విదేశాలతో అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నా యన్న అంశంపై కొంతమేర ఆందోళనలు నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం (టీపీపీ) 12-దేశాలతో ఉన్న ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవడానికి అంగీకారాన్ని ప్రకటించడంతో డాలర్ బలహీనపడిందని తెలిపారు.
దీంతో దేశీయ కరెన్సీ సోమవారం భారీగా లాభపడింది. అమెరికా కరెన్సీ డాలర్ అమ్మకాలు పెరగడంతో ప్రారంభ వాణిజ్యంలో రుపీ బాగా బలపడింది. ఇతర కరెన్సీలతో డాలర్ బలహీనపడటంతో దేశీయ కరెన్సీ రూపాయికి మద్దతు లభించింది. డాలర్ తో పోలిస్తే రూపాయి 17 పైసలు లాభపడి రూ. 68.01 ని నమోదు చేసింది. ప్రస్తుతం 9 పైసల లాభంతో రూ. 68.10 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయల్ 0.2 శాతం ఎగిసింది. బ్యారెల్ ముడి చమురు రధ 55.58డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్ లోని ప్రారంభ నష్టాలతో ప్రారంభలాభాలను స్వల్పంగా కోల్పోయినట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. గత ముగింపులో 5 పైసలు నష్టంతో రూ. 68.18 వద్ద ముగిసింది. వారం కనిష్ఠాన్ని నమోదుచేసింది. ప్రపంచ వ్యాపారం కుంచించనుందనే అంచనాల నేపథ్యంలో మార్కెట్లలోఆందోళన నెలకొందని టోక్యో స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోయిషీ యాషీకావా అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ అనుసరించినున్న పన్ను కోతలు , అవస్థాపన ఖర్చులు సహా ఇతర విధానాలు సెనేట్ ఆమోదం అంత సులభం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.
కాగా డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఐదురోజుల నష్టాలకుబ్రేక్ వేసి లాభాలతో ముగిశాయి. అన్ని అంశాలలోనూ అమెరికన్లు, స్వదేశానికే ప్రాధాన్యమివ్వనున్నట్టు ట్రంప్ స్పష్టం చేయడంతో సెంటిమెంట్ బలపడింది.