మళ్లీ మా దేశం రావద్దు!
దేవయానికి అమెరికా ఆదేశం
కోర్టు విచారణకు తప్ప భవిష్యత్‌లో వీసా ఇవ్వం
వాషింగ్టన్/న్యూయార్క్: భారతీయ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేను శుక్రవారం దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించిన అమెరికా.. తాజాగా శనివారం ఆమెను తిరిగి అమెరికాలోకి రాకూడదంటూ నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఆమెకు వీసా జారీ చేయకుండా తమ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థను అప్రమత్తం చేస్తామని పేర్కొంది. అమెరికా నుంచి వెళ్లినంత మాత్రాన దేవయానిపై నమోదైన అభియోగాల్లో మార్పేమీ ఉండబోదని, ఆమెపై అరెస్ట్ వారంట్ జారీ చేసే అవకాశం కూడా ఉందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జెన్‌సాకి స్పష్టం చేశారు. అమెరికా నుంచి శుక్రవారం భారత్ చేరుకున్న దేవయానికి ఇకపై దౌత్యరక్షణ కూడా ఉండబోదన్నారు.
‘ఇకపై దేవయాని అమెరికాకు తిరిగి రాకూడదన్న ఆదేశాలను భారత్‌కు బయల్దేరే ముందే ఆమెకు, భారత ప్రభుత్వానికి తెలియజేశాం. కోర్టు విచారణ నిమిత్తం మాత్రమే ఆమెను అమెరికాలో మళ్లీ అడుగుపెట్టేందుకు అనుమతిస్తాం’ అన్నారు. దీన్ని బట్టి దేవయానిని అమెరికా బహిష్కృత వ్యక్తి(పర్సోనా నాన్ గ్రాటా)గా నిర్ధారించినట్టు స్పష్టమవుతోంది. భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకున్న దేవయానికి ఆరు, మూడేళ్లున్న ఇద్దరు కూతుర్లున్నారు. వారిని కూడా త్వరలో ఆమె భారత్‌కు రప్పించాలనుకుంటున్నారు.
ఒప్పందం ఫలితంగానే.. దేవయాని విషయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో.. భారత్, అమెరికాలు ఒక ఒప్పందానికి రావడం వల్లనే దేవయాని భారత్‌కు వచ్చేసిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల అధికారులు, న్యాయవాదుల మధ్య సమస్య సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయని.. అయితే, దేవయానిపై చేసిన నేరాభియోగాల తీవ్రతను తగ్గిస్తామని, వాటిని పూర్తిగా వెనక్కు తీసుకోలేమని అమెరికా.. వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిందే అని భారత్.. భీష్మించుకోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గురువారం నాటికి ఇరుదేశాలుఅంగీకారానికి రావడం వల్లనే అమెరికా దేవయానిని భారత్ పంపించిందని వెల్లడించాయి. అయితే, దేవయానిపై నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకునేందుకు అమెరికా ససేమిరా అంటోందని, తీవ్ర నేరం స్థాయి నుంచి ‘తప్పుడు నడవడిక’ స్థాయి నేరానికి ఆ అభియోగాలను తగ్గించేందుకే అంగీకరించిందని తెలిపాయి. అయితే దేవయానిపై అభియోగాలను అంగీకరించబోమని భారత్ వాదిస్తోందన్నారు. కాగా, ఐరాస శాశ్వత మిషన్‌కు తన బదిలీని అంగీకరించడం ద్వారా అమెరికా తనకు పూర్తి దౌత్యరక్షణకు ఆమోదం తెలిపిందని, అందువల్ల తనపై కేసు కొట్టేయాలని దేవయాని న్యూయార్క్ కోర్టును కోరారు.
విదేశాంగ మంత్రితో దేవయాని భేటీ
న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి భారత్ తిరిగివచ్చిన దేవయాని శనివారం విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తనకు కొన్ని రోజులు సెలవు కావాలని వారిని కోరారు.