‘ప్రాణహిత-చేవెళ్ల’ డిజైన్ మార్చొద్దు | don't change to pranahita - chevella project design | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత-చేవెళ్ల’ డిజైన్ మార్చొద్దు

Published Sat, Aug 15 2015 3:27 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

‘ప్రాణహిత-చేవెళ్ల’ డిజైన్ మార్చొద్దు - Sakshi

‘ప్రాణహిత-చేవెళ్ల’ డిజైన్ మార్చొద్దు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాను తప్పించే ప్రభుత్వ ఆలోచనపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. ప్రస్తుత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టును చేపట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రాజకీయ పార్టీల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో జిల్లాకు అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై పోరాడేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మాజీ మంత్రి  జి.ప్రసాద్‌కుమార్‌ను కన్వీనర్‌గా నియమించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పి.సబితారెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు పాలనాపరమైన అన్ని అనుమతులు వచ్చి.. పనులు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధంతరంగా జిల్లాను తొలగించడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అసెం బ్లీని స్తంభింపజేస్తే ప్రభుత్వం దిగిరావడం ఖాయమన్నారు. అలాగే, ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమిస్తేనే ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు లేనందున లక్షలాది ఎకరాలు బీడువారాయని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో ఈ భూములు తిరిగి పచ్చబారుతాయన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్, రంగారెడ్డి, కోదండరెడ్డి,  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్, సీపీఎం నేత నరసింహులు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, లోక్‌సత్తా నేత రామ్మోహన్‌రావు, ప్రజా చైతన్య వేదిక ప్రతినిధి కొమ్మిడి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement