'ఇక చాలు ఆపండి.. లేదంటే ఒంటరవుతారు'
న్యూఢిల్లీ: 'ఇక చాలు ఆపండి లేదంటే ఒంటరిగా మిగిలిపోతారు' అని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. పార్లమెంటు సభల్లో ఆందోళనను విరమించి ప్రజా సమస్యలు చర్చించేందుకు అవకాశం ఇప్పించాలని లేదంటే తాము మద్ధతు ఉపసంహరించుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. అంతకుముందు 25మంది కాంగ్రెస్ పార్టీ నేతలను సస్పెండ్ చేయడంపట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
'ఇక చాలు చాలు. మీరు ఇలాగే ఆందోళన కొనసాగిస్తూ వెళితే ఏ మాత్రం మద్దతివ్వలేం' అని ములాయం అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి వ్యతిరేకంగా సభలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తుండగా అందుకు ససేమిరా అంటూ బీజేపీ తెగేసి చెప్పడంతో వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనివల్ల పార్లమెంటులో చర్చకు రావాల్సిన ఎన్నోవిలువైన అంశాలు అసలు వేదిక మీదకు రాకుండానే పోయాయి. ఈ నేపథ్యంలోనే ములాయం కాంగ్రెస్ పార్టీ తీరుపట్ల తన నిరసన గళం తొలిసారి వినిపించారు. అంతకుముందు సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఉండటం గమనార్హం.