
ఆహార బిల్లుకు మద్దతివ్వొద్దు: వైఎస్సార్‌సీపీ
పార్లమెంట్‌లో ఆహార భద్రతా బిల్లుకు సీమాంధ్ర ఎంపీలు మద్దతివ్వకుండా నిరసన తెలపాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంపీలను కోరారు. సమైక్యరాష్ట్రం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సాక్షి, కడప: పార్లమెంట్‌లో ఆహార భద్రతా బిల్లుకు సీమాంధ్ర ఎంపీలు మద్దతివ్వకుండా నిరసన తెలపాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంపీలను కోరారు. సమైక్యరాష్ట్రం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆహారభద్రతా బిల్లుకు ఆమోదం పొందాలని పార్లమెంట్‌లో విప్‌జారీ చేశారని, అయితే విప్ ధిక్కరించి మద్దతు ఇవ్వకుండా నిరసన తెలపాలని ఆయన సూచించారు. విప్ ధిక్కరించకపోతే ఎంపీలు ఈ ప్రాంతంలో అడుగు పెట్టలేరని హెచ్చరించారు. ఆహారభద్రతాబిల్లు అవసరమే అయినప్పటికీ 6కోట్ల మందికి అన్యాయం జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఆ బిల్లు గురించి తర్వాత ఆలోచించాలని పేర్కొన్నారు. విభజన జరిగితే అందుకు కేంద్రమంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, పల్లంరాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబుదే పూర్తి బాధ్యత అన్నారు. గతంలో అవిశ్వాస తీర్మానం నుంచి చిరంజీవి కాంగ్రెస్‌ను గట్టెక్కించారని, మరోసారి సీబీఐ కేసులకు భయపడి చంద్రబాబు కాంగ్రెస్‌ను కాపాడారని, వాటి ఫలితమే ప్రస్తుత విభజన నిర్ణయమని నిందించారు.
హైదరాబాద్ తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రింగ్‌రోడ్డు నుంచి ఎయిర్‌పోర్టు వరకు అన్నిటికీ శంకుస్థాపన మొదలుకుని ప్రారంభోత్సవం వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి చేశారన్నారు. సమైక్యరాష్ట్రం కోసం రాష్ట్రవ్యాప్తంగా 340 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని పార్టీ తరఫున నివాళులర్పించారు. ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రాష్ట్రం తరఫున తాము ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.