డీడీని చిక్కుల్లో పడేసిన యాంకర్
న్యూఢిల్లీ: 'గవర్నర్ ఆఫ్ ఇండియా'- దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో యాంకరమ్మ నోటి నుంచి జాలువారిన మాట ఇది. ఈ మాటే ఇప్పుడు దూరదర్శన్ కు తలనొప్పి తెచ్చిపెట్టింది. అంతేకాదు మహిళా గవర్నర్ ను 'అతడు' గా సంబోధించి ప్రసారభారతిని చిక్కుల్లో పడేసింది.
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫీ) నవంబర్ 20న గోవాలో ప్రారంభమైంది.ఈ సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి... 'గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అభిప్రాయాలు మనతో పంచుకుంటారు' అని వ్యాఖ్యానించింది.
ఈ వీడియా సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్ పై విమర్శలు రేగాయి. అయితే పొరపాటును సరిచేసి నాలుగు నిమిషాల తర్వాత పునఃప్రసారం చేశామని డీడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జరిగిన తప్పుకు గల కారణాలు తెలుసుకునేందుకు ఏడీజీ స్థాయి అధికారిని ఆదేశించినట్టు చెప్పారు. 'గవర్నర్ ఆఫ్ ఇండియా' వ్యాఖ్య చేసిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని వెల్లడించారు.
ఇంతకుముందు కూడా దూరదర్శన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరులోని ఎక్స్ఐ(XI)ని రోమన్ సంఖ్య అనుకుని ఓ యాంకర్ ఎలెవన్ గా పలకడంతో డీడీపై విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు సంబంధించిన వార్తలు చదువుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసి ప్రసారభారతి అభాసుపాలైంది.