రోజుకు ఓ కప్పుటీతో మతిమరుపు దూరం
సింగపూర్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవుడిలో సొంతంగా ఆలోచించే శక్తిని రాను రాను తగ్గించేస్తోంది. ప్రతి చిన్న పనికీ ఇంటర్నెట్, కంప్యూటర్, క్యాలిక్యులేటర్ వంటివాటిపై ఆధారపడడంతో ఆలోచనాశక్తితోపాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా డిమెన్షియా(మతిమరుపు/చిత్తవైకల్యం) సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే దీనికి విరుగుడు రోజు ఓ కప్పు టీ తాగడమేనని చెబుతున్నారు పరిశోధకులు. రోజూ ఓ కప్పు టీ తాగడం వల్ల డిమెన్షియా సమస్య తగ్గుతుందని సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
55 ఏళ్లు పైబడిన 957 మంది చైనీయులపై పరిశోధన చేసి ఈ నిర్ధారణకు వచ్చామని చెప్పారు. జన్యుపరంగా వచ్చిన మతిమరుపు సమస్యతో బాధపడుతున్నవారిలో కూడా ప్రతిరోజూ టీ తాగడం వల్ల సమస్య కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు గుర్తించామన్నారు. అయితే ఏ రకమైన టీ తాగినా ఇవే ఫలితాలు వెల్లడయ్యాయని చెప్పారు. డిమెన్షియాతో బాధపడుతున్నవారిలో సమస్య తీవ్రతను తగ్గించేందుకు అధిక మోతాదులో మందులను వినియోగించాల్సి ఉంటుందని, అయితే మందులు వాడిన తర్వాత కూడా సమస్య మళ్లీ ప్రారంభం కావడం గుర్తించామని, అందుకే ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ టీ తాగడం వల్ల కొంతమేర సత్ఫలితాలు ఉంటాయని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెంగ్ లీ అభిప్రాయం వ్యక్తం చేశారు.