అవినీతికి మరోఎస్సై బలి! | Dubbaka Si Chitti babu killed his Wife and Himself with Service Revolver | Sakshi
Sakshi News home page

అవినీతికి మరోఎస్సై బలి!

Published Sat, Mar 4 2017 3:22 AM | Last Updated on Fri, May 25 2018 5:57 PM

అవినీతికి మరోఎస్సై బలి! - Sakshi

అవినీతికి మరోఎస్సై బలి!

- దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్య
- సర్వీసు రివాల్వర్‌తో భార్యను కాల్చి, తానూ కాల్చుకున్న వైనం
- అవినీతి డబ్బు కోసం అధికారుల వేధింపులు?
- 20 రోజులుగా మానసిక వేదన అనుభవించిన ఎస్సై
- చేయని తప్పుకు సస్పెన్షన్‌ ఉత్తర్వులపై ఆందోళన
- బాసుల తీరుపై పోలీసు వర్గాల్లో నిరసన గళం
- ఘటనపై మెదక్‌ అదనపు ఎస్పీ నేతృత్వంలో విచారణ
- చిట్టిబాబు ఆత్మహత్యకు పైఅధికారుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు  


సాక్షి, సిద్దిపేట

చూస్తుండగానే మరో ఘోరం జరిగిపోయింది. రాష్ట్రంలో అవినీతి రక్కసి కోరలకు మరో ఎస్సై బలైపోయారు. ఉన్నతాధికారుల వేధిం పులు భరించలేక, తాను చేయని తప్పును తనపై వేసుకోలేక సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు (54) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీసు రివాల్వర్‌తో తన భార్యను కాల్చి తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దుబ్బాక పోలీసు క్వార్టర్స్‌లో శుక్రవారం పట్టపగలే ఈ ఘటన జరిగింది. గత తొమ్మిది నెలల్లో ఒకే పోలీసు డివిజన్‌ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న రెండో ఎస్సై చిట్టిబాబు కావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ జిల్లా కడప పట్టణానికి చెందిన చిట్టిబాబు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని రాకాసిపేటలో స్థిరపడ్డారు. 1984లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి కొన్నేళ్ల కిందే ఎస్సైగా పదోన్నతి పొందారు. ఆయనకు భార్య సరోజ (48), ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రేమ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె స్వర్ణ ఎంబీఏ చదువుతున్నారు. సరోజ హైదరాబాద్‌లోని తమ కుమారుడి వద్ద ఎక్కువగా ఉంటుంటారు. తరచూ దుబ్బాకకు వచ్చి వెళుతుంటారు. అయితే గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లిన చిట్టిబాబు... శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్యతో సహా దుబ్బాకలోని తమ పోలీస్‌ క్వార్టర్‌కు చేరుకున్నారు. తర్వాత రెండు గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా మంచంపై నిద్రపోతున్న భార్య సరోజ (48)ను కణతపై పాయింట్‌ బ్లాంక్‌ దూరం నుంచి కాల్చి.. తర్వాత తాను గదమ భాగంలో కాల్చుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పేర్కొంటున్నారు.

ఓ హోంగార్డు చూడటంతో..
మధ్యాహ్నం భోజనం కోసం ఏం తీసుకురావాలో అడిగేందుకు ప్రభాకర్‌ అనే హోంగార్డు ఎస్సై చిట్టిబాబు క్వార్టర్‌ వద్దకు వచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న ఎస్సైని, ఆయన భార్యను చూసి వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందికి చెప్పారు. పోలీసులు వచ్చేటప్పటికే సరోజ చనిపోయి ఉండగా.. చిట్టిబాబు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పిస్టల్‌ రక్తపు మడుగులోనే పడి ఉంది. పోలీసులు చిట్టిబాబును సిద్దిపేట సురక్షా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. కాగా ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయిస్తామని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ తెలిపారు. ఉన్నతాధికారులు విచారణాధికారిగా మెదక్‌ అదనపు ఎస్పీ రాంచంద్రారెడ్డిని నియమించారని ప్రకటించారు.

ఆధారాలు సేకరించిన క్లూస్‌ టీం
చిట్టిబాబు ఆత్మహత్యకు సంబంధించి ఘటనా స్థలంలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మెదక్‌ అదనపు ఎస్పీ రాంచంద్రారెడ్డి, సిద్దిపేట రూరల్‌ సీఐ సైదులు ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. పంచనామా పూర్తయ్యే వరకు డీఐజీ అకున్‌ సబర్వాల్‌ అక్కడే ఉన్నారు. చిట్టిబాబు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్యహత్యకు పాల్పడ్డారని.. కుటుంబ సభ్యులు ఏవిధంగా ఫిర్యాదు చేస్తే అదే విధంగా కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

సెట్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఆత్మహత్య వరకు..
సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ ఖర్చుల కోసం ప్రతి పోలీసు స్టేషన్‌ నుంచి నెలకు రూ.ఐదు వేలు, పైఅధికారులు వచ్చినప్పుడు డీజిల్‌ ఖర్చులు ఇవ్వాలనే నిబంధన అమలవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని చిట్టిబాబు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా పోలీసు బాస్‌తో జరిగిన ఓ సెట్‌ కాన్ఫరెన్స్‌లో వివాదం తలెత్తి ఆత్మహత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. చిట్టిబాబు తీరును మనసులో పెట్టుకున్న జిల్లా అధికారి.. దుబ్బాక మండలంలో బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని, ఇసుక దందా నడుస్తోందని, వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చిట్టిబాబును నిలదీసినట్టు సహచర పోలీసులు చెబుతున్నారు. దీనిపై చిట్టిబాబు దీటుగానే స్పందించి... తన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బెల్టు దుకాణాలు లేవని, దాదాపు 60 మందిపై కేసులు పెట్టానని, మీరు అనుమతిస్తే పీడీ యాక్ట్‌ పెట్టడానికైనా సిద్ధమేనని బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన అనంతరం గత నెల 3న శిక్షణ నిమిత్తం చిట్టిబాబు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

పనిగట్టుకుని ప్రతీకారం!
తిరిగి 20వ తేదీన విధుల్లోకి చేరడానికి వచ్చిన చిట్టిబాబును విధుల్లో చేరకుండా అడ్డుకుంటూ ఐడీ పార్టీకి అటాచ్‌ చేశారు. ఇదే సమయంలో స్పెషల్‌ పార్టీ పోలీసులతో పనిగట్టుకొని దుబ్బాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో తనిఖీలు చేయించారు. చివరికి తిమ్మాపూర్‌ అనే గ్రామంలో ఒక బెల్టు దుకాణాన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆ దుకాణం, ఇసుక రవాణాలను కారణంగా చూపిస్తూ చిట్టిబాబును సస్పెండ్‌ చేసినట్టు సమాచారం. గురువారం సాయంత్రం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారని, కానీ వాటిని తీసుకోవడానికి చిట్టిబాబు నిరాకరించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఆ డైరీలో ఏముందో?
చిట్టిబాబుకు నిత్యం తన కార్యకలాపాలు డైరీలో రాసుకునే అలవాటు ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు తనను వేధించిన అంశంపై ఆయన తన డైరీలో, హ్యాండ్‌ బుక్‌లో రాసే ఉంటారని అంటున్నారు. చిట్టిబాబుకు చెందిన కారులో నలుపు రంగులో ఉన్న స్పైరల్‌ డైరీ ఒక దానిని గుర్తించారు. కారు లాక్‌ చేసి ఉండడంతో శుక్రవారం సాయంత్రం వరకు దానిని తీయలేదు. ఆ డైరీని పరిశీలిస్తే కొంత సమాచారం దొరకవచ్చని భావిస్తున్నారు.

మా నాన్నను వేధించారు: ఎస్సై చిట్టిబాబు కుమారుడు ప్రేమ్‌కుమార్‌
‘‘మా నాన్న చాల ధైర్యవంతుడు. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. కానీ ఆయనను ఉన్నతాధికారులు వేధించారు. ఆయనను దోషి అని చూపడానికి ప్రత్యేక పోలీసులతో గ్రామాల్లో సోదాలు చేయించారు. 30 ఏళ్లు డిపార్టుమెంటుకు సేవ చేసిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే నాన్న నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని చెప్పారు..’’మీడియాకు చెప్పారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన కూడా ధర్నాలో కూర్చున్నారు.

ఆరోపణలు అవాస్తవం: సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌
‘‘చిట్టిబాబు మృతిపై సీనియర్‌ పోలీసు అధికారితో విచారణ చేపట్టాం. ఆయన ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమనే ఆరోపణల్లో నిజం లేదు. 1984లో కానిస్టేబుల్‌గా నియమితుడైన చిట్టిబాబు 2012లో ఎస్సైగా ప్రమోషన్‌ పొందారు. 2004లో ఒకసారి సస్పెండయ్యారు. ఆరు రోజుల క్రితం ఓ క్రైమ్‌ దర్యాప్తులో భాగంగా సిద్దిపేటకు అటాచ్‌ చేశాం. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మూడు రోజుల క్రితం సస్పెండ్‌ చేశాం. కానీ చిట్టిబాబు ఆ ఆదేశాలను ఇంకా తీసుకోలేదు. ఎస్సైగా విధుల్లోనే ఉన్నారు..’’


పోలీసులు మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు: మంత్రి హరీశ్‌రావు
‘‘శాంతి భద్రతలను పరిరక్షించి ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులు మనోస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలేమైనా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పాలి. వారి వద్ద కూడా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పోలీసులు రక్షణ కోసం వాడే తుపాకులతోనే తమ ప్రాణాలు తీసుకుంటుంటే గుండె తరుక్కుపోతోంది..’’

అతినీతి మంచి ఎస్సైని బలి తీసుకుంది: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
‘‘అవినీతి ఒక మంచి ఎస్సైని బలి తీసుకుంది. దళిత కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి ఇలా అర్ధంతరంగా తనువు చాలించటం తీవ్రంగా కలచివేసింది. నాకు తెలిసినంత వరకు ఎస్సై చిట్టిబాబు మచ్చ లేని పోలీసు అధికారి. ఆయన ఆత్మహత్యపై, పోలీసు శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి..’’

ఎస్సైల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలి: చాడ
సాక్షి, హైదరాబాద్‌: గత రెండేళ్లుగా ఎస్సై స్థాయి అధికారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అందుకు బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా సిద్దిపేటలోనే నలుగురు ఎస్సైలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. చిట్టిబాబు తన భార్యను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇలా ఎస్సైలు ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖకు మచ్చ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement