వాట్సాప్ గ్రూపు: 'హలో... హాయ్' కోసం కాదు
దేశంలో ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికలు జరుగుతున్న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే. ఆధునిక సాంకేతిక సౌకర్యాలను కూడా ఈ పరిశీలకుల అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ఈసీ వారందరికీ ఆయా రాష్ట్రాల్లోని లోకల్ మొబైల్ సిమ్ లు, వాటికవసరమైన స్మార్ట్ ఫోన్లను ఇవ్వడంతో పాటు వాటి ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల తీరుతెన్నులను పరిశీలించాలని ఈసీ తాజాగా నిర్ణయించింది.
సాధారణ ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఆయా పార్టీలు పెట్టే వ్యయాన్ని పర్యవేక్షించడానికి మూడు విధానాల్లో నియమించిన ఈ ఎన్నికల అధికారులకు ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రత్యేకాధికారులు (సీఈవో), కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘమే ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎన్నికల నిమిత్తం నియమించిన అధికారులందరినీ ఆ గ్రూపులో చేరుస్తారు.
గతంలో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో అత్యవసరమైన విషయాలను ఈ మెయిల్స్ ద్వారా లేదా ఫాక్స్ ద్వారా ఎన్నికల సంఘానికి చేరవేసేవారు. ఇప్పుడు అలా కాకుండా అత్యవసర సమాచారం, ముఖ్యమైన ఘటన చోటుచేసుకున్నప్పుడు ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆ వాట్సాప్ గ్రూపులో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తేవాలి. ఈ గ్రూపు ద్వారా వచ్చే సమాచారం మేరకు తీసుకోవలసిన చర్యలపై ఎన్నికల అధికారులు మరింత అప్రమత్తం చేస్తారు. అయితే టాప్ సీక్రెట్ సమాచారం గానీ సున్నితమైన సమాచారం గానీ ఈ గ్రూపుల్లో పోస్టు చేయరాదని కట్టడి విధించారు.
ఈ గ్రూపు కేవలం ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడానికే తప్ప ఇతరత్రా దుర్వినియోగం కారాదని కూడా ఈసీ స్పష్టంచేసింది. అనేక మంది అధికారులు తమ మధ్య ఉన్న పరిచయాలతో సోది కబుర్లు చెప్పుకోవడం, పనికిమాలిన విషయాలను పోస్టు చేయడం, పొద్దున్నే హలో... హాయ్... అంటూ మెసేజీలు పెట్టరాదని ఎన్నికల సంఘం అధికారులందరికీ గురువారం జారీచేసిన ఆదేశాల్లో స్పష్టంచేసింది.