న్యూఢిల్లీ: ఓ కానిస్టేబుల్ పై అనవసరంగా చేయిచేసుకున్న జర్మన్ ఎంబాసీలో పనిచేస్తున్న భారతీయ మహిళపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన 2 వారాల అనంతరం ఆమెపై కేసు నమోదు కావడం గమనార్హం. మే 5 వ తేదీన నగరంలోని మహర్షి రమణ్ మార్గ్ లో విధుల్లో ఉన్న మహ్మద్ ఫరూఖ్ అనే కానిస్టేబుల్ పై ఆ మహిళ దుర్భాలాడటంతో పాటు, అతనిపై చేయి చేసుకుంది. ఆ మార్గంలో వెళ్లడానికి వాహనానికి పాస్ అనివార్యం కావడంతో ఆమెను కానిస్టేబుల్ ఆపడంతో వివాదం రాజుకుంది. పాస్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పడంతో కారులోంచి వేగంగా దూసుకొచ్చిన ఆమె అతనిపై చేయి చేసుకుని బూతుల పంచాంగం అందుకుంది. అనంతరం అతనిపై దురుసుగా ప్రవర్తించింది.
కాగా, ఆమె కారు నంబర్ ను నోట్ చేసినా.. వెంటనే ఆ వివరాలను సేకరించడంలో జాప్యం జరిగిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమె అడ్రస్ ను కనుగొన్న పోలీసులు వివరాలు వెల్లడించారు. ఆ మహిళ చాణక్యపురిలో ఉన్న జర్మన్ ఎంబాసీలో పని చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అయినప్పటికీ ఆమెపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి మినహాయింపు ఉండదన్నారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.