సత్యం కేసులో ఈడీ చార్జిషీట్
మొదటి ముద్దాయిగా సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నిర్ధారించింది. ఈ మేరకు మనీలాండరింగ్ చట్టంలోని అనేక సెక్షన్ల కింద సత్యం కంప్యూటర్స్, బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు తదితరులపై ఈడీ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది. సత్యం కంపెనీపై సీబీఐ నమోదు చేసిన కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టులోనే ఈడీ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది.
కేసు నమోదు చేసిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో రామలింగరాజు భార్య నందిని, కంపెనీలో డెరైక్టర్లుగా ఉన్న ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చారు. సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్ సంస్థను మొదటి ముద్దాయిగా పేర్కొనగా నిందితుల జాబితాలో 47 మంది వ్యక్తులతో పాటు 166 కంపెనీలను (మొత్తం 213 మంది నిందితులు) చేర్చారు. ఈ కేసులో 76 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. 1,186 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపారు. దాదాపు ఐదు వందల పేజీల చార్జిషీట్‌తో పాటు 20 వేల పేజీల అనుబంధ డాక్యుమెంట్లను సమర్పించారు. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 కింద అభియోగాలను మోపారు. ఈడీ కేసులను సెషన్స్ కోర్టు మాత్రమే విచారించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్యం కంపెనీపై సీబీఐ నమోదు చేసిన కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టును ఇటీవలే సెషన్స్ కోర్టు స్థాయికి పెంచారు.
రామలింగరాజు కుట్రదారుడు: సత్యం కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు తన కంపెనీకి చెందిన సీఈవో ఇతరులతో కుమ్మక్కై లాభాలు ఉన్నట్లుగా చూపుతూ బ్యాలెన్స్‌షీట్లను రూపొందించారని ఈడీ చార్జిషీట్‌లో ఆరోపించింది. 2001-2008 సంవత్సరాల మధ్య ఆర్థిక అవకతవకలకు పాల్పడిన రామలింగరాజు లేని ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపించారని తెలిపింది. షేర్ విలువను పెంచుకునేందుకే రామలింగరాజు ఈ కుట్రకు పాల్పడ్డారంది. ‘సత్యం’ నిధులను రామలింగరాజు కుటుంబం అక్రమంగా 327 బినామీ కంపెనీలకు మళ్లించినట్లు చెప్పింది.
ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ జాయింట్ డెరైక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇదిలావుండగా ఈ కుంభకోణంలో మదుపుదారులు దాదాపు రూ. 14 వేల కోట్లు నష్టపోయినట్లు సీబీఐ అంచనా వేసింది. 2009 జనవరిలో రూ.500 పైచిలుకు ఉన్న సత్యం షేర్ విలువ, కుంభకోణం కుట్ర వెలుగుచూసిన మరుక్షణమే రూ. 10కి పడిపోయింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బైర్రాజు రామలింగరాజు నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు రూ. 1,075 కోట్ల పైచిలుకు ఆస్తులను ఈడీ గతంలో జప్తు చేసిన విషయం తెలిసిందే.