ఇంజనీరింగ్ వైపు 80 శాతం యువత చూపు
అధిక జీతం, ఎక్కువ అవకాశాలే కారణం
ముంబై: కొత్త కోర్సులు, కొత్త కొత్త ఉద్యోగాలు ఎన్నొస్తున్నా.. ఇంజనీరింగ్ చేసేందుకే భారత యువత ఆసక్తి చూపుతోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఈ రంగంలోనే ఎక్కువ సంపాదనతో పాటు సృజనాత్మకత కూడా ఎక్కువని యువత భావిస్తోందని క్వీన్స్ ఎలిజబెత్ ప్రైజ్ ఫర్ ఇంజనీరింగ్ సంస్థ సర్వేలో తేలింది. ఇండియా, టర్కీల్లో 16-17ఏళ్లున్న వారిలో 80 శాతం ఇంజనీరింగ్ పట్టా అందుకునేందుకే ఆసక్తి చూపుతోందని సర్వే చెప్పింది.
ఎక్కువగా సంపాదించే అవకాశం, ఉజ్వలమైన కెరీర్ ఇంజనీరింగ్‌లోనే ఉందనే అభిప్రాయం అభివృద్ధి చెందుతున్న దేశాల యువతలో వ్యక్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ పట్టాకున్న విలువ కారణంగా అవకాశాలు సృష్టించుకోవచ్చని.. దీంతోపాటు సమాజ సేవ చేసేందుకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని.. 2015 సంవత్సరానికి క్వీన్స్ ఎలిజబెత్ ప్రైజ్ ఫర్ ఇంజనీరింగ్ విజేత డాక్టర్ రాబర్ట్ లాంగన్ తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంజనీరింగ్ విద్యకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుండటం కూడా యువత ఆసక్తి ఇటువైపు మారేందుకు కారణమని తేలింది. అమెరికా, జర్మనీ, భారత్‌లలో ఇలా ఆలోచించే యువత మరింత ఎక్కువగా ఉన్నారని రాబర్ట్ తెలిపారు.