బాలికలకు రోల్‌మోడల్‌గా నిలుస్తా
►మారథాన్‌తో 31 జిల్లాల్లో పర్యటన
►జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరవుతా
►మారథాన్ ప్లేయర్ నిఖితాయాదవ్
► అభినందించిన కలెక్టర్ అమ్రపాలి
హన్మకొండ అర్బన్: ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే తన లక్ష్యమని సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతానికి చెందిన కోర నిఖితాయాదవ్ అన్నారు. అసాధ్యమైన లక్ష్యాలు సుసాధ్యం చేసి బాలికల్లో రోల్ మోడల్‌గా నిలవాలని ఈ సాహస కార్యానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రసుతం మారథాన్‌తో తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి బాలికల్లో ఆత్మస్తైర్యం నిపేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. ఇప్పటికి 13 జిల్లాల్లో పర్యటన ముగించుకుని మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి తన లక్ష్యాలను వివరించింది.
అనతంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశానని, కుంటుంబ పెద్దలు, యాదవ సంఘాల సహకారంతో ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తానని చెప్పింది. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని తెలిపింది. ప్రస్తుతం మారథాన్‌తో 31జిల్లాలో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నాని మీడియా ముందు తెలియజేసింది.
ఏప్రిల్ 27న ప్రారంభమైన మారథాన్‌లో ఇప్పటి వరకు సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, కొమురంబీం, గోదావరిఖని, కరీంనగర్ జిల్లాల్లో పర్యటనతో 600 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాని వివరించింది. జూన్ 2నాటికి హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటానని నికిత తెలిపింది. కాగా, చిన్న వయస్సులోనే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకని ఆ దిశగా పయనిస్తున్న నిఖితను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పరంగా సహకారం అందిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కృషి చేస్తా. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తా.
– నిఖితాయాదవ్