రాహుల్ ఇమేజ్ పోయింది!
ఐదు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాహుల్ ఇమేజ్ ను భారీగా దెబ్బతీశాయి.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాహుల్ ఇమేజ్ ను భారీగా దెబ్బతీశాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీకే వశం కాబోతున్నట్టు వెల్లడికావడంతో, యువరాజుపై ఇన్నిరోజులు కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలన్నీ తలకిందులయ్యాయి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ రాజకీయ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారబోతుంది. అన్ని పార్టీలకు ఎంతో కీలకమైన అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీని ప్రచారంలోకి దించి, కాంగ్రెస్ పెద్ద ప్రయత్నమే చేసింది. కానీ వారి ఆశలన్నింటిన్నీ రాహుల్ ఆవిరిచేయబోతున్నారని వెల్లడైంది. ఒంటరిగా కాకుండా సమాజ్ వాద్ పార్టీలో పొత్తులో బరిలో దిగినప్పటికీ, రాహుల్ ప్రయత్నాలు ఫలించడం లేదు. ముందు నుంచి సీనియర్ లీడర్లు ఉత్తరప్రదేశ్ లో రాహుల్ ప్రచార నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. కానీ క్యాంపెయిన్ భారాన్నంతటిన్నీ రాహుల్ తన భుజాలపై వేసుకున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ సత్తా చాటుతుందని వెల్లడవుతున్న పంజాబ్ రాష్ట్ర గెలుపు క్రెడిట్ కూడా రాహుల్ కు దక్కేలా కనిపించడం లేదు. పంజాబ్ రాష్ట్రంలో విక్టరీ అమరేందర్ సింగ్ ఖాతాల్లోకి వెళ్తుండగా.. ఉత్తరాఖాండ్ విజయం హరీశ్ రావత్ సొంతం కాబోతుందని వెల్లడవుతోంది. కానీ ఏ ఒక్క క్రెడిట్ రాహుల్ కు రాదట. రాహుల్ కు ఇన్నిరోజులు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పకుండా ఉత్తరప్రదేశ్ గెలుపుకోసం ఎదురుచూస్తున్న హైకమాండ్ కూడా ఇక దీనిపై పునరాలించాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆమెనే ప్రెసిడెంట్ గా కొనసాగిస్తూ పార్టీ సీనియర్ లీడర్లందరూ రాహుల్ బలబలాలను నిశీతంగా పరిశీలిస్తూ వస్తున్నారు. అటు రాహుల్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ, తన బలాన్ని ఆయన నిరూపించుకోలేకపోతున్నారు. 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల వరకు రాహుల్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. ఈ దెబ్బతో రాహుల్ స్థానంలో ఆయన సోదరి ప్రియాంకకు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాలని పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత వచ్చే లోక్ సభ పోల్ క్యాంపయిన్ కు ప్రియాంకను రంగంలోకి దించాలని కూడా వారు పట్టుబట్టే అవకాశముందట.