
మహిళ ప్రాణం తీసిన ఫేస్ బుక్ 'ప్రేమ'!
జబల్పూర్:ఈ మధ్య కాలంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పరిచయాలు వికటించడం అధికంగానే కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్ ను కొంతమంది ప్రేమకు వేదికగా ఎంచుకుంటూ పెళ్లి ముడితో ఒక్కటవుతుంటే.. మరికొందరు మాత్రం చెడు మార్గం పడుతూ తమ జీవితాల్ని బలితీసుకుంటున్నారు. ఇలా ఫేస్ బుక్ లో పరిచయమైన మహిళను ఓ యువకుడు హత్య చేసిన ఘటన జబల్పూర్ లో కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో నివాస ముంటున్న వినీత్ సింగ్(22) అనే యువకుడు ఫేస్ బుక్ లో పరిచయమైన జ్యోతి కోరి (44) అనే మహిళను హత్య చేశాడు. ఆమె తనకంటే వయసులో పెద్దది కావడమే కాకుండా, ముగ్గురు పిల్లలకు తల్లి కావడమే ఈ హత్యోదంతానికి దారి తీసింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది.
రెండున్నరేళ్ల క్రితం ఫేస్ బుక్ లో తారసపడిన జ్యోతితో పరిచయం ఏర్పరుచుకుని, ఆమెను ప్రేమించసాగాడు. అతని ప్రేమకు ఆమె కూడా అంగీకారం తెలపడంతో వారిద్దర మధ్య సాగిన ప్రేమ కబుర్లు హద్దూ అదుపులేకుండా పోయింది. కాగా, ఆమె ఎప్పుడూ కూడా తన ఫోటును మాత్రం పెట్టకుండా వేరే వాళ్ల ఫోటోలు పెట్టేది. ఈ క్రమంలోనే వారిద్దరూ ఈనెల 18 వ తేదీన జబల్పూర్ లో కలిశారు. ఆమె తనకంటే రెండింతలు పెద్దదన్నవిషయం తెలియడంతో ఆవేశానికి లోనైన ఆ యువకుడు తనవెంట తెచ్చుకున్న నాటుతుపాకీతో ఆమెను హత మార్చాడు.. అతని ఫేస్ బుక్ అకౌంట్ లో పిస్టల్ తో కూడిన ఫోటోగ్రాఫ్ లను ఎక్కువగా ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.