నోరు విప్పని సదాశివ
పశ్చిమ బెంగాల్ నుంచి రూ.లక్ష నకిలీ నోట్లు
బంగ్లాదేశ్‌లో ముద్రణ?
జయపురం: నకిలీ నోట్ల తీగ లాగితే బంగ్లాదేశ్ వరకు పోతోంది. నకిలీ నోట్ల చలామణి కేసులో అరెస్టయిన సదాశివ హరిజన్ పోలీసుల విచారణలో వివరాలు వెల్లడించడం లేదని తెలిసింది. ఒడిశా నవరంగపూర్ జిల్లా తెంతులికుంటి సమితి అంచలగుడ పంచాయతీ ఉరమఝిగుడ గ్రామంలో నకిలీ నోట్ల ముఠాను పట్టుకున్న విషయం విదితమే. నకిలీ నోట్ల వ్యవహారంతో జిల్లాలో పలువురికి సంబంధాలు ఉన్నాయని తెలిసింది.
బంగ్లాదేశ్‌లో ముద్రించిన నోట్లు పశ్చిమ బెంగాల్ మీదుగా రాష్ట్రానికి చేరుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉరమఝిగుడ గ్రామంలో అరెస్టు చేసిన సదాశివ హరిజన్, సోదరి సితాయి హరిజన్‌ను తెంతులికుంటి పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఆదివారం సదాశివ ఇంటిపై దాడి చేసి రూ.72 వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సదాశివ హరిజన్‌ను అరెస్టు చేసి, అతని సోదరి సితాయి రిజన్‌ను, తల్లి లలిత హరిజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
ఈ వ్యవహారంలో సితాయి హరిజన్‌కు సంబంధం ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అమెను అరెస్టు చేశారు. న వరంగపూర్‌లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల లింక్ పశ్చిమ బెంగాల్ వరకు ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిసింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నుంచి లక్ష రూపాయల నకిలీ నోట్లు తెచ్చామని పోలీసుల దర్యాప్తులో సదాశివ చెప్పినట్లు తెలిసింది. ఆ డబ్బు ఎవరు ఇచ్చారు, వారితో సంబంధాలు, వ్యాపార లావాదేవీలకు సంబంధించి సదాశి నోరు విప్పడం లేదని తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురి పేర్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
నకిలీ నోట్ల చలామణి నెట్‌వర్క్ సంబంధించి పోలీసులు కొంత పురోగతి సాధించారని తెలిసింది. కానీ ఆవివరాలు చెప్పడానికి పోలీసులు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. నవరంగపూర్ జిల్లాలో నకిలీ నోట్ల మార్పిడికి సంబంధించి లక్ష రూపాయలు వచ్చాయని రూ.28 వేలు చెలామణి చేశారని పోలీసు అధికారి బిషికేషన్ తెలిపారు. మిగిలిన రూ.72 వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. కొరాపుట్ జిల్లా పొట్టంగిలో కూడా నకిలీ నోట్ల ముఠాను గతంలో పోలీసులు పట్టుకున్నారు.
నవరంగపూర్, నందాహండి, తెంతులికుంటి ప్రాంతాల్లో కొందరు నోట్ల చలామణి చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొందరిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారని సమాచారం. కొరాపుట్ జిల్లా పొట్టంగి, నవరంగపూర్ జిల్లా తెంతులికుంటి సమితిలో నకిలీ నోట్ల చలామణి అవుతున్న విషయం వెల్లడి కావడంతో, నకిలీ నోట్ల ముఠా ఒకటి ఉందని పోలీసులు భావిస్తున్నారు.