అప్పులు అన్నదాతను ఆత్మహత్యలవైపు ఉసిగొల్పుతున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు కాలం కలిసి రాక..
ఆరుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి నెట్‌వర్క్: అప్పులు అన్నదాతను ఆత్మహత్యలవైపు ఉసిగొల్పుతున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు కాలం కలిసి రాక.. పూలమ్మిన చోటే కట్టెలమ్మలేక బలవన్మరణాల బలిపీఠం ఎక్కుతున్నారు. అప్పుల బాధ తాళలేక శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు తెలంగాణ జిల్లాల్లో మొత్తం ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండ లం ఎలుకుర్తి హవేలికి చెందిన రైతు నౌగిరి శ్రీను(44) తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న వేశాడు.
రెండేళ్ల నుంచి సాగు చేస్తున్నా దిగుబడి రాక.. గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో అప్పుల పాలయ్యాడు. రూ. 2.40 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది శు క్రవారం అర్ధరాత్రి ఉరివేసుకున్నాడు. ఇదే జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన రైతు దంతెనపల్లి నర్సింహారావు(40) ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేసేందుకు దుక్కి సిద్ధం చేశాడు. చేతిలో పెట్టుబడి లేక, అప్పు తీరే మార్గం కనిపించక శనివారం క్రిమిసంహారక మందుతాగాడు.
కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన రైతు నరిగె రవి అప్పులు చేసి తనకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేశాడు. అవసరమైన నీరు అందకపోవడంతో పంట దెబ్బతింది. మనోవేదనకు గురైన రవి గత నెల 31న రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. అప్పటి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవి శుక్రవారం రాత్రి చనిపోయాడు. మెదక్ జిల్లా ఇదే మండలం రాజ్‌పల్లి పరిధి తిమ్మక్కపల్లికి చెందిన రైతు శ్రీపతి మైపాల్(30) తన భూమిలో నీటి కోసం అప్పు చేశాడు. అది తీరే మార్గం కానరాక శనివారం ఉరి వేసుకున్నాడు.
మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన కుర్వ బక్కన్న, కుర్వ సవారమ్మ(35) పంటల సాగుకోసం రూ.8 లక్షలు అప్పుచేశారు. పంట పోవడంతో సవారమ్మ పురుగుమందు తాగింది. ధరూరు మండలంలోని దోర్నాలకు చెందిన హరిజన్ దుబ్బన్న (42)వ్యవసాయం కోసం రూ.రెండులక్షలు అప్పుచేశాడు. అవి తీరే దారి కానరాక శనివారం రాత్రి పురుగు మందు తాగి మృతి చెందాడు.
రైతులూ ఆత్మహత్యలొద్దు: మంత్రి హరీశ్
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు కోరారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం నారాయణరావుపేటలో శనివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాద న్నారు. సీఎం కేసీఆర్ సాగునీటి కోసం భగీరధుడిలా కృషి చేస్తున్నారని అన్నారు.