‘నా కూతుర్ని ఐఐటీకి పంపి తప్పు చేశా’
న్యూఢిల్లీ: తన కూతుర్ని ఢిల్లీ ఐఐటీకి పంపించి తప్పు చేశానని పీహెచ్‌డీ విద్యార్థిని మంజులా దేవక్ తండ్రి వాపోయారు. జల వనరులపై పీహెచ్‌డీ చేస్తోన్న మంజుల అనుమానాస్పద పరిస్థితుల్లో మంగళవారం రాత్రి ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో మృతి చెందింది. తన కుమార్తెను ఉన్నత చదువులకు పంపించకుండా ఉండాల్సిందని మంజుల తండ్రి అన్నారు. చిన్న వయసులో తన కూతురుకు పెళ్లి చేయడం పొరపాటైందన్నారు.
‘నా కూతుర్ని ఐఐటీకి పంపించి తప్పు చేశాను. కట్నం ఇచ్చేందుకు డబ్బు కూడబెట్టాల్సింది. జాతకాలు బాగా కలిశాయని చిన్న వయసులొనే పెళ్లి చేశామ’ని వెల్లడించారు. తన కూతుర్ని చదివించడం అల్లుడు రితేశ్ విర్హాకు ఇష్టం లేదని, చదువు మాన్పించేసి తనతో పాటు వ్యాపారం చేయాలని ఒత్తిడి చేసేవాడని తెలిపారు. వ్యాపారం ప్రారంభించడానికి రూ. 25 లక్షలు తీసుకురావాలని తన కుమార్తెను వేధించాడని ఆరోపించారు. కుటుంబ గౌరవం పోతుందన్న భయంతో తన కూతురు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించిందని చెప్పారు.
గతంలో అమెరికాలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేసిన మంజుల 2011లో ఢిల్లీ ఐఐటీలో చేరింది. కాగా, మంజుల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మంజుల ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు.