
డీలర్ల సమాఖ్యతో ‘కార్‌దేఖో’ ఒప్పందం
న్యూఢిల్లీ: కార్ల డీలర్లు ఆన్‌లైన్లోనూ వాహనాల విక్రయం చేపట్టేందుకు తోడ్పాటు అం దించేలా ఆన్‌లైన్ ఆటోమొబైల్ సంస్థ కార్‌దేఖోడాట్‌కామ్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) చేతులు కలిపాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆన్‌లైన్లో వాహనాల లిస్టింగ్ ప్రక్రియను, వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడే వ్యూహాలు తదితర అంశాల గురించి డీలర్లకు అవగాహన కల్పిస్తామని కార్‌దేఖోడాట్‌కామ్ సీఈవో అమిత్ జైన్ తెలిపారు.
ప్రస్తుతం అంతా డిజిటల్ మీడియా హవా నడుస్తున్న నేపథ్యంలో కార్ డీలర్లు, ఆటోమొబైల్ సంస్థలు ఈ శక్తివంతమైన మాధ్యమం ద్వారా మరిన్ని వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆయన చెప్పారు. ఇక వాహనాలకు సంబంధించిన సమాచార సేకరణ ఎక్కువగా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారానే జరుగుతున్నందున, కార్‌దేఖో వంటి సంస్థతో భాగస్వామ్యం డీలర్లకు లాభిస్తుందని ఎఫ్‌ఏడీఏ డెరైక్టర్ నికుంజ్ సంఘీ చెప్పారు.