మెగాస్టార్ సతీమణికి నచ్చిన 'మసాన్'లో ఓ దృశ్యం
ముంబై: 'సినిమాలు చూడాలంటేనే భయమేస్తోంది. మానవత్వం, సున్నితత్వం మచ్చుకైనా కనపడవు. తెరనిండా పాశ్చాత్య పోకడలు.. పొట్టపొట్టి దుస్తులు! పాత్రల్లో భారతీయత ఎక్కడుంది? సినిమాల వల్ల జనం కూడా కఠినంగా మారిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమావాళ్లు దారుణంగా బరితెగించారు. ఫిలింమేకింగ్ పచ్చి బిజినెస్ అయిందిప్పుడు. మాట్లాడితే 100 కోట్ల కలెక్షన్లు, లేదంటే తొలివారం రికార్డులు. బాబోయ్.. ఇవన్నీ నాకు ఎప్పటికీ అర్థంకాని విషయాలు. అందుకే అలాంటి చోట నేను ఉండలేను' అని బాలీవుడ్ సీనియర్ నటి, మెగాస్టార్ అమితాబ్ బచ్చన సతీమణి జయ బచ్చన్ అన్నారు.
ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్(మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా దిగ్గజ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమలో జయ బచ్చన్ మాట్లాడారు. 50వ, 60 దశకాల్లో వచ్చిన సినిమాల్లో భారతీయ జీవం ఉట్టిపడేదని, రానురాను సినిమాల్లో పాశ్చాత్య అనుకరణ ఎక్కువైపోయిందని ఆమె అన్నారు. అయితే భారతీయుల ఆలోచనా విధానం ప్రగతిశీలంగానే ఉందని పేర్కొన్నారు. జనజీవితాలను ప్రతిబించించే కొన్ని సినిమాలు మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని, మసాన్, అలీగఢ్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని, అలాంటివాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని జయ చెప్పారు.