
డ్రోన్లతో వరద ముప్పునకు చెక్: ఫైబర్ నెట్ డైరెక్టర్లు
డ్రోన్ల సహాయంతో వరద ముప్పునకు చెక్ పొట్టొచ్చని ఏపీ ఫైబర్ నెట్ డైరెక్టర్లు అన్నారు.
చిలకలూరిపేట రూరల్: వరదలు వచ్చినప్పుడు డ్రోన్ల సాయంతో వాస్తవ పరిస్థితులను సమీక్షించుకుని, నష్టం వాటిల్లకుండా చూసుకోగలిగే అవకాశం ఉంటుందని ఏపీ ఫైబర్ నెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వి.కృష్ణ, పి.అంజయ్య, టెక్నికల్ డెరైక్టర్ అట్లూరి రామారావులు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డులో మంగళవారం విలేకరులతో ఫైబర్ నెట్ డైరెక్టర్లు.. ఇటీవల కుప్పగంజివాగు ఉప్పొంగడంతో దెబ్బతిన్న పంటలను డ్రోన్ల ద్వారా పరిశీలించి, నష్టాలను అంచనావేస్తామని చెప్పారు.
నరసరావుపేట మండలంలోని గురవాయపాలెం, ఇస్సాపాలెం, క్రోసూరు, అచ్చంపేట మండలాలు, చిలకలూరిపేట మండలంలోని గంగన్నపాలెం, గోవిందపురం, కావూరు, వేలూరు గ్రామాల్లో డ్రోన్ల ద్వారా వాస్తవ వ్యవసాయ పరిస్థితులు పరిశీలించామని, అధికారులతో సమీక్షి నిర్వహించామని తెలిపారు. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా నష్టం శాతాన్ని కచ్చితంగా అంచనా వేసే వెసులుబాటు ఉంటుందని, రెవెన్యూ రికార్డులను డ్రోన్లకు అనుసంధానం చేయడం ద్వారా పంట పొలాల వివరాలు పూర్తిగా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు.
ప్రతి డ్రోను 100 మీటర్ల ఎత్తు, ఒక కిలోమీటరు దూరం ప్రయాణించి అక్కడి పరిస్థితులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియజేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, ఏపీ ఫైబర్ నెట్ మార్కెటింగ్ మేనేజర్ సీహెచ్.శ్రీధర్, మండల వ్యవసాయాధికారి కేవీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏఈవోలు, ఎంపీఈవోలు పాల్గొన్నారు.