
రుతుపవనాల కదలికలపై దృష్టి
► ఐఐపీ, ద్రవ్యోల్బణం డేటా కూడా కీలకమే
► ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : ఇటీవల కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాల కదలికలపై ఇన్వెస్టర్లు ఈ వారం దృష్టి నిలుపుతారని, రుతుపవనాలు వివిధ ప్రాంతాల్లో విస్తరించడానికి సంబంధించిన వార్తలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు అంచనావేశారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా ప్రతి ఏటా దేశంలో ప్రవేశించే తేదీకన్నా ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా గత శుక్రవారం కేరళ తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం సగటుకన్నా తక్కువ వర్షపాతం నమోదుకావొచ్చంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు రుతుపవనాల కదలికల్ని సునిశితంగా గమనిస్తారని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. మార్కెట్ అప్‌ట్రెండ్‌కు తగిన ట్రిగ్గర్లు సమీప భవిష్యత్తులో ఏవీ లేనందున, సూచీలు హెచ్చుతగ్గులకు లోనవుతూ దిగువముఖంగా పయనించవచ్చని ఆయన అంచనావేశారు.
ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి, మే నెల వినియోగ ద్రవ్యోల్బణం డేటా కూడా మార్కెట్ కదలికల్ని నిర్దేశించవచ్చని విశ్లేషకులు చెప్పారు. ఈ రెండు గణాంకాలు వచ్చే శుక్రవారం వెలువడనున్నాయి. డాలరుతో రూపాయి మారకపు విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్, చమురు ధరలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని వారన్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కొద్ది నెలల్లో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు, యూరోజోన్‌లో కొనసాగుతున్న రుణ సంక్షోభం, పెరుగుతున్న చమురు ధరలు తదితర అంశాలు భారత్ మార్కెట్‌ను ఒడుదుడులకు లోనుచేయవచ్చన్నది నిపుణుల అంచనా.
కొద్ది ట్రేడింగ్ సెషన్లపాటు మార్కెట్ బలహీనంగా వుండవచ్చని బొనంజా పోర్ట్‌ఫోలియో వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ అన్నారు. గత శుక్రవారం రాత్రి వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాల డేటాకు ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ మార్కెట్ స్పందిస్తుందని ఆయన చెప్పారు. మే నెలలో అమెరికాలో ఉపాధి కల్పన అంచనాలకంటే అధికంగా జరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఈ డేటా కారణంగా ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతవారం మార్కెట్...
వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదంటూ రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ జూన్ 2నాటి పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టంచేయడంతో గతవారం భారత్ సూచీలు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 3.8% నష్టంతో 26,768 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అంతేశాతం క్షీణించి 8,115 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు బాగా నష్టపోయాయి.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 1,600 కోట్లు
న్యూఢిల్లీ : మే నెలలో భారత్ మార్కెట్‌లో అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) జూన్ తొలివారంలో మాత్రం ఈక్విటీల్లో రూ.1,600 కోట్లు నికరంగా పెట్టుబడి చేశారు. అయితే ఇదేవారంలో రూ. 1,883 కోట్ల విలువైన రుణపత్రాల్ని విక్రయించినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. గత నెలలో వారు రూ. 5,700 కోట్ల ఈక్విటీల్ని, రూ. 8,500 కోట్ల విలువైన రుణపత్రాల్ని నికరంగా విక్రయించారు.