దాణా కేసులో 3న శిక్షలు ఖరారు చేయనున్న సీబీఐ కోర్టు
రాంచీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా నిర్దారించింది. లాలూతో సహా 45 మంది నిందితులను కోర్టు దోషులుగా పేర్కొంది. 16 ఏళ్ల పాటు సాగిన విచారణలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అటు.. లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 900 కోట్ల రూపాయల విలువైన దాణా స్కాం వెలుగు చూసింది. శిక్షలను అక్టోబర్ 3న కోర్టు ఖరారు చేయనుంది. లాలూకు మూడు నుంచి ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది.
పశుదాణా కేసులో మొత్తం 61 కేసులను సీబీఐ నమోదు చేసింది. ఇప్పటివరకూ 1200 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది .నాటి మంత్రి జగన్నాధ్ మిశ్రాను న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఖజానా నుంచి 37.7 కోట్లు కాజేశారని నిర్థారించింది. అలాగే ఆరుగురు రాజకీయ నాయకులను, మరో నలుగురు ఐఏఎస్ అధికారులనూ దోషులుగా ప్రకటించింది.
సీబీఐ లాలూ, నాటి మంత్రి జగన్నాధ్‌మిశ్రా, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా పలువురు కోట్లు మింగారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చైబాస జిల్లా ట్రెజరీ నుంచి ఈ భారీ మొత్తాన్ని డ్రా చేశారని వాదనలు వినపించాయి. ఈ కుంభకోణంపై సీబీఐకేసు నమోదు చేయడంతో లాలూ 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.