మాధవ్ శింగరాజు
రాంచీలో చలి ఎక్కువగా ఉన్నట్లుంది. బిర్సా ముండా జైలు కూడా రాంచీలో భాగమే కనుక ఇక్కడున్నవన్నీ చలికి బిగదీసుకుపోతున్నాయి. ఈ బిగదీసుకుపోతున్న వాటిలో పద్నాలుగు రోజులుగా నేనూ ఒకడిని. ప్రార్థన, ఉదయపు నడక.. వీటితో నన్ను నేను వెచ్చబరుచుకుంటున్నాను. ఇంకా మూడేళ్ల చలికాలాలు నేనిక్కడ గడపాలి! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంటి నుంచి తెప్పించుకునే అవకాశం కల్పించారు. ఒక వంట మనిషిని పెట్టారు. కొన్ని పేపర్లు వస్తున్నాయి. టీవీ చూడనిస్తున్నారు. ఇవన్నీ నాకు అక్కరలేనివి. అందుకే సమకూర్చినట్లున్నారు!
నాకు మనుషులు కావాలి. నేను మనుషులతో మాట్లాడాలి. అందుకు మాత్రం అనుమతించడం లేదు. అడిగినవి కాదనడం కన్నా, అక్కర్లేనివి అందివ్వడం పెద్ద శిక్ష మనిషికి! మునుపు ఇలా లేదు. గెస్ట్‌హౌస్‌నే నా కోసం జైలుగా మార్చారు. నన్ను కలవడానికి సీఎం కూడా వచ్చాడు. నేరుగా జైలుకే వచ్చాడు! హేమంత్ సొరేన్. కుర్రాడు. ‘‘లాలూజీ మీకు ఇక్కడ సౌకర్యంగానే ఉంది కదా’’ అని పక్కన కూర్చొని అడిగాడు. ‘‘లేకుంటే చెప్పండి ఏర్పాటు చేయిద్దాం’’ అన్నాడు.
‘‘నాకు మనుషులు కావాలి’’ అన్నాను. అర్థం చేసుకున్నాడు. మా పార్టీవాళ్లను పంపిస్తానన్నాడు. అవసరం అయితే తన పార్టీవాళ్లను కూడా పంపిస్తానన్నాడు. ‘‘మనవాళ్లు ఒడిశా, బెంగాల్‌లలో కూడా ఉన్నారు లాలూజీ, వాళ్లను కూడా రప్పిస్తాను’’ అన్నాడు. హేమంత్ సొరేన్‌ది జార్ఖండ్ ముక్తి మోర్చా. పేరుకు జార్ఖండ్ సీఎమ్మే కానీ, బిహార్ పిల్లాడిలా ఉండేవాడు. ‘‘మావాళ్లు చాలు హేమంత్’’ అన్నాను. ఇప్పుడు వారానికి ముగ్గురిని మాత్రమే బయటి నుంచి నన్ను కలవడానికి అనుమతిస్తున్నారు.
వచ్చినవాళ్లు ‘‘ఎలా ఉన్నారు లాలూజీ’’ అని అడుగుతున్నారు. వచ్చినవాళ్లను ‘‘పార్టీ ఎలా ఉంది?’’ అని నేను అడుగుతున్నాను. అక్కడితో టైమ్ అయిపోతోంది. ఈ ఉదయం ఇంటి నుంచి అటుకులు, బెల్లం వచ్చాయి. కొన్ని పండ్లు, నువ్వులుండలు కూడా. నోటికి రుచిగా ఉన్నాయి. నా పక్క వాళ్లకు ఇచ్చాను. ‘‘బాగున్నాయి లాలూజీ’’ అన్నారు. వాళ్లెవరో నాకు తెలీదు. లోపలికి వచ్చాకే పరిచయం.
‘‘ఆ నితీశ్ కుమారే మిమ్మల్ని జైల్లో పెట్టించాడు లాలూజీ’’ అన్నాడు ఒక పరిచయస్తుడు. నవ్వాను. అతడు నా అభిమానిలా ఉన్నాడు. జైలుకు వచ్చినప్పటి నుంచీ అతను ఒకే మాట అంటున్నాడు. ‘‘మిమ్మల్ని కూడా మాతో కలిపేశారేంటి లాలూజీ’’ అని. జీవితంలో మనిషి దేనికో ఒకదానికి బందీ కావాలి. నేను పార్టీకి బందీని అయ్యాను. ఇష్టమైన దానికి బందీ అవడం కంటే స్వేచ్ఛ ఏముంది? జైల్లో ఉన్నా నేను స్వేచ్ఛాజీవినే.
Comments
Please login to add a commentAdd a comment