సాక్షి, పట్నా : జైలు అనే మాట వినిపిస్తేనే అమ్మో.. అని భయం వేస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎలాగైనా బయటపడేందుకు ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తాం. కానీ, స్వయంగా కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లే సాహసం ఎవరైనా చేస్తారా?.. సినిమాల్లో అయితే సాధ్యమేగానీ, నిజజీవితంలో మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రయత్నమే ఓ ఇద్దరు వ్యక్తులు చేశారు. విశ్వాసం చూపించడంలో తమకు తామే సాటి అనిపించుకున్నారు. వారు ఆర్జేడీ అధినేత, దాణా కుంభకోణం కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్షకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత విశ్వాసపాత్రులు. ఒకరు లాలూ వంటమనిషికాగా, మరొకరు పాలప్యాకెట్లు తీసుకురావడంవంటి సహాయక చర్యలు చేసే రాంచీకి చెందిన వ్యక్తి.
వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్ మహతో, మదన్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు తమపై తామే తమ బంధువుతో కేసులు పెట్టించుకొని, లాలూ ప్రసాద్ యాదవ్‌కంటే ముందే జైలుకు వెళ్లి అక్కడ ఆయనకోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మణ్ మహతో అనే వ్యక్తి లాలూ ప్రసాద్‌కు పలు విధాలుగా సాయం చేసేవాడు. ముఖ్యంగా వంట చేయడంతోపాటు లాలూ రాజకీయ క్షేత్రంలో కీలకంగా పనిచేసేవాడు. ఇక మదన్ యాదవ్ అనే వ్యక్తి లాలూ ఎప్పుడు రాంచీ వచ్చినా చాలా హడావుడి చేసేవారు. చురుకుగా లాలూ చేసే పనుల్లో పాల్గొంటూనే లాలూ ఇంటి పనులు చూసుకునేవాడు.
లాలూ త్వరలోనే జైలులో అడుగుపెట్టనున్నారనే విషయం గమనించి.. రాంచీలో సుమిత్ యాదవ్ అనే ఓ వ్యక్తితో తాము అతడిపై దాడి చేసినట్లు ఓ పది వేల రూపాయల దొంగతనం చేసినట్లు కేసు పెట్టించుకున్నారు. అయితే, రాంచీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసేందుకు నిరాకరించగా మరో స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించుకున్నారు. దీంతో వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గత డిసెంబర్ (2017) 23నే బిర్సా ముండా జైలుకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన వారంతా వీళ్లు మాములోళ్లు కాదని, మహాముదుర్లని, అందుకే అలా చేశారని అంటున్నారు. కాగా, ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో శిక్షపడిన లాలూ ప్రసాద్ వారు ఉంటున్న జైలుకే వెళ్లనున్నారు.
కేసులు పెట్టించుకొని లాలూకోసం జైలులో వెయిటింగ్..
Published Tue, Jan 9 2018 11:22 AM | Last Updated on Tue, Jan 9 2018 12:12 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment