
సంయమనం పాటించండి: కేసీఆర్
తెలంగాణపై ఆందోళన వద్దు: కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు గురించి ఆందోళ న అవసరం లేదని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగదని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ వాదులంతా సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో నిరసనలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పాస్ చేయించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం పట్టుదలతో ఉందని, స్వంతపార్టీ ఎంపీలే వ్యతిరేకంగా ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారిందన్నారు.
లగడపాటి టార్గెట్ స్పీకర్!
స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని పెప్పర్ స్ప్రేను చల్లాలని ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించారని, ఆయన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రాంత సభ్యులు అడ్డుకున్నారని కేసీఆర్ తనను కలసిన తెలంగాణ జేఏసీ నేతలకు చెప్పారు. లోక్‌సభలో లగడపాటి పెప్పర్ స్ప్రేను ప్రయోగించడాన్ని ప్రస్తావిస్తూ.. స్పీకర్‌పై చల్లడం ద్వారా టీ బిల్లును ప్రవేశపెట్టడానికి వీల్లేకుండా చేయాలనేదే వారి ప్రయత్నమని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. తెలంగాణ సభ్యులు అప్రమత్తంగా ఉండటం వల్ల సాధ్యం కాలేదని అన్నారు. లోక్‌సభలో బిల్లు పెట్టడం ద్వారా ఇప్పటిదాకా అంతా అనుకున్నట్టుగానే జరిగిందని చెప్పారు. సీమాంధ్ర నేతల క్రూరత్వం ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకే తె లుసునని, పార్లమెంటులో జరిగిన ఘటనలతో దేశమంతా అర్థమైందని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలతో కలిసి ఉండలేరని అన్ని పార్టీల నేతలు అంటున్నారన్నారు.