ఐస్క్రీమ్ తాతను చూసి గుండె కరిగి..
చికాగో: వయసు పైబడిన ఓ ముసలాయన ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని ఐస్ క్రీమ్ బండిని నెట్టుకుంటూ పోతున్నాడు. అదేదో సరదా కోసం చేస్తున్నదో లేక అలవాటైన పనోకాదని ఆయన అవస్థ చూస్తే అర్థమైపోతుంది. సోషల్ సెక్యూరిటీ ఉండి కూడా ఈ వయసులో ఆయనింత కష్టపడుతున్నడెందుకో!
చికాగో మహానగర శివారు గ్రామంలో ఐస్ క్రీమ్ లు అమ్ముకునే ఫిడెన్సియో శాంచేజ్ ను చాలామంది చాలాసార్లు చూసి ఉండొచ్చు. అందులో కొందరు 'అయ్యో!' అని సానుభూతి వ్యక్తం చేసి ఉండొచ్చు. మెక్సికన్ వ్యాపారి జోయెల్ మాత్రం సానుభూతితోనే సరిపెట్టలేదు. కారు ఆపి, ఐస్ క్రీమ్ తాత దగ్గరికెళ్లి ఆయన కథేంటో తెలుసుకున్నాడు.
89 ఏళ్ల ఫిడెన్సియో శాంచేజ్ తన భార్య ఎలాడియాతో కలిసి ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట ఫరవాలేదనే స్థాయిలో జీవించిన ఆ జంట.. ఒక్కగానొక్క కూతురి మరణంతో శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ విషాదం నుంచి తేరుకుందామనుకునేలోపే ఎలాడియాకు జబ్బుచేసింది. భార్యకు వైద్యం చేయించేందుకు ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టేసిన శాంచేజ్.. నెలవారీ మందుల కోసం ఉన్న ఊళ్లోనే ఇలా ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నాడు.
ఐస్ క్రీమ్ తాత శాంచేజ్ కథ విన్న జోయెల్.. తనకు తోచిన సహాయం చేయడమేకాక 'గో ఫండ్ మీ' ఫేస్ బుక్ పేజ్ ను తెరిచి వృద్ధ దంపతుల కోసం 3వేల డాలర్ల విరాళాన్ని కోరాడు. శుక్రవారం రాత్రి తెరుచుకున్న 'గో ఫండ్ మీ' పేజ్ కు ఆదివారం ఉదయానికల్లా 1500 డాలర్ల విరాళాలు అందాయి. జోయెల్ తోపాటు దాతలందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు ఐస్ క్రీమ్ తాత- బామ్మలు.