క్షమాపణ కోరుతూ శాంసంగ్ ప్రకటనలు
కొంగొత్త ఆశలతో ప్రత్యేక ఆకర్షణగా వినియోగదారుల ముందుకు వచ్చిన నూతన స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్7తో ఇన్ని చిక్కులు వస్తాయని శాంసంగ్ కంపెనీ బహుశ ఆలోచించనేలేదేమో. గెలాక్సీ నోట్7 విడుదలైన ప్రారంభంలో సప్లైను మించి డిమాండ్ దూసుకెళ్లడంతో, దీనిపై ఆ కంపెనీ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ ఆశలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో, గెలాక్సీ నోట్7కు అత్యంత ప్రమాదకరమైనదిగా పేరు వచ్చేసింది. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో ఆ ఫోన్లను రీకాల్ ప్రారంభించింది. అయితే వినియోగదారులకు ఇంత మొత్తంలో అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ కోరుతోంది ఆ సంస్థ. తాము కలిగించిన ఈ అసౌకర్యవంతమైన పనికి మీడియా ప్రకటనల ద్వారా క్షమాపణలు కోరతామని, క్షమాపణ ప్రకటనలను త్వరలోనే ఆవిష్కరిస్తామని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం వెల్లడించింది.
మేజర్ మీడియా అవుట్లెట్ల ద్వారా క్షమాపణలు కోరతామని తెలిపింది. చార్జీ పెట్టేటప్పుడు, ఫోన్ ఆన్షర్ చేసినప్పుడు బ్యాటరీ పేలుళ్ల ఘటనలు సంభవిస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గెలాక్సీ నోట్7 ఫోన్ను శాంసంగ్ సెప్టెంబర్ 2 నుంచి గ్లోబల్గా రీకాల్ చేయడం ప్రారంభించింది. రీప్లేస్మెంట్తో ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది. శాంసంగ్ ఉద్యోగులందరూ ఈ సమస్యను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని కంపెనీ పేర్కొంది. రీఫండ్కు బదులుగా ఈ ఫోన్ రీప్లేస్మెంట్కు వేరే డివైజ్ను ఎంచుకునే యూజర్లకు సబ్సిడీ అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఓటీఏ అప్డేట్ టెక్నాలజీతో గెలాక్సీ నోట్7 బ్యాటరీ పేలుళ్ల సమస్యను అధిగమించనున్నట్టు పేర్కొంది.