
రైతుల పొట్టకొట్టి రాజధాని నిర్మిస్తారా ?
గుంటూరు : రైతుల పొట్టకొట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని కడతారా అని ఉండవల్లి గ్రామ రైతు గంగిరెడ్డి శివశంకరరావు ప్రశ్నించారు. ఆదివారం పెనుమాకలో పవన్ కల్యాణ్ ఎదుట శివశంకరరావు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో టీడీపీకి ఎప్పుడూ ఓటు వేయలేదన్నారు. కానీ మీరు చెప్పారని గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని చెప్పారు.
గతంలో చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చుక్క నీరు లేకపోయినా... తమ ప్రాంతంలో మూడు పంటలు పండించామన్నారు. మండు వేసవిలో కూడా తమ ప్రాంతం చల్లగా ఉంటుందన్నారు. కృష్ణా జిల్లా నుంచి 30 ఏళ్ల క్రితం తాము ఇక్కడికి వలస వచ్చామని తెలిపారు. తమకు 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. భూమి ఇస్తే తాము ఎలా బతకాలంటూ పవన్ కల్యాణ్ ఎదుట శివశంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు.