బరువైన బాల్యం..
సాధారణంగా ఐదేళ్ల వయసు పిల్లలెవరైనా అప్పుడే స్కూల్‌కి వెళ్తూ, అమ్మనాన్నల ఒడిలో ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, బామ్మ, తాతయ్యల ఆలనాపాలనలో సేదతీరుతూ గడిపేస్తారు. ఆ వయసులో పిల్లలకు ఎలాంటి ఒత్తిడీ, బాధ్యతలూ ఉండవు. అయితే అందరిబాల్యం ఒకేలా ఉండదు. కొందరు పిల్లలు చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. చైనాకు చెందిన అన్నా వాంగ్ అనే ఓ ఐదేళ్ల బాలిక తన బామ్మ, తాతమ్మలను సంరక్షిస్తోంది. చిన్నతనంలోనే వయసుకు మించిన బాధ్యతల్ని మోస్తూ విస్మయపరుస్తోంది. వయసుకు బరువైన పనులైనా, బాధ్యతగా భావిస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది.
ఎవరూ లేకపోవడంతో..
నైరుతి చైనాలోని జుయిన్ అనే మారుమూల పర్వత ప్రాంతంలో ఉండే ఓ గ్రామంలో చిన్న ఇంటిలో నివసించే బాలిక అన్నా వాంగ్. అన్నాకి మూడు నెలల వయసున్నప్పుడు, ఆమె తండ్రి జైలుపాలయ్యాడు. కొంతాలం తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో అన్నా, ఆమె బామ్మ, తాతమ్మ (బామ్మకి అమ్మ) మాత్రమే మిగిలారు. వృద్ధులైన బామ్మ, తాతమ్మల్ని సంరక్షించడానికి ఎవరూ లేరు. దీంతో ఆ బాధ్యతల్ని అన్నా తీసుకుంది. వారిద్దరి సంరక్షణకు పూనుకుంది.
అన్నీ తానై..
చిన్నప్పటినుంచే బామ్మ, తాతమ్మలకు సేవ చేయడం మొదలుపెట్టింది అన్నా. వృద్ధులైన వారిద్దరూ దాదాపుగా మంచానికే పరిమితం. బామ్మకి ఆర్థరైటిస్ సహా పలు అనారోగ్య సమస్యలుండడంతో ఎటూ కదలలేదు. తాతమ్మకు కూడా దాదాపు 92 ఏళ్లు ఉండడంతో ఆమె సైతం సొంతంగా ఏ పనీ చేసుకోలేదు. దీంతో ఇద్దరి సంరక్షణా బాధ్యతల్ని అన్నా తన భుజాలపై వేసుకుని, వారికి అన్ని రకాలుగా సాయపడుతోంది.
వంటసహా బాధ్యతలన్నీ..
ఐదేళ్లలోపు పిల్లలకు వంట చేయడం అసలేరాదు. కానీ అన్నా మాత్రం బామ్మ, తాతమ్మల కోసం రోజూ వంట చేస్తుంది. నిజానికి ఇంట్లో వంట చేసే స్టవ్ చాలా ఎత్తులో ఉన్నప్పటికీ, ఓ స్టూల్ వేసుకుని వంట చేయడం విశేషం. ఇక పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి రోజూ తాజా కూరగాయలు తీసుకుని వస్తుంది. ఈ విషయంలో చుట్టుపక్కల వారు ఎంతగానో సహకరిస్తారు. అన్నా కష్టం చూడలేని వారు, ఎప్పుడు అవసరమైనా తమ పొలంలోంచి నచ్చిన కూరగాయలు తీసుకెళ్లేందుకు అనుమతించారు.
ప్రతి పనీ సొంతంగానే..
అన్నా ప్రతిరోజూ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి దినచర్య ప్రారంభిస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయలు తీసుకురావడం, వంట చేయడం సహా మొత్తం పనులన్నీ సొంతంగానే చేస్తుంది. అన్నాకు సాయపడేందుకు ఎవరూ లేరు. బామ్మ, తాతమ్మలకు స్నానం చేయించడం, తినిపించడం, కాలకృత్యాలకు తీసుకెళ్లడం వంటి పనులను సైతం అన్నా ఏ విసుగూ లేకుండా చేస్తుంది. పిల్లలు ఈ వయసులో పెద్దవారికి అంత సేవచేయడం చాలా అరుదు. కానీ అంత సేవ చేస్తున్నా, బామ్మ, తాతమ్మలపై అన్నాకి కొంచెం కూడా విసుగురాదు. వారికి సేవచేయడం తనకెంతో ఇష్టమని, వారిద్దరి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానని అన్నా చెప్పింది. అయితే అప్పుడప్పుడూ తన తండ్రి ఫొటో చూస్తూ అన్నా కంటతడి పెట్టుకుంటుంది. తన తండ్రి జైలు నుంచి తిరిగొస్తాడని, ఇబ్బందులు తొలగిపోతాయని ఆశతో ఎదురు చూస్తోంది అన్నా.
– సాక్షి, స్కూల్ ఎడిషన్