మూడు మునకలే..!
ఇంద్రకీలాద్రి :
పుష్కర స్నానానికి విచ్చేసే భక్తుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. తొలి రోజున పద్మావతి ఘాట్‌లో బాలుడు నీట మునిగి మృతి చెందడంతో రెండో రోజు నుంచి బందోబస్తు కట్టుదిట్టం చేశారు ప్రతి స్నాన ఘాట్‌లో స్నానాలు చేసే భక్తులను వెయ్యి కళ్లతో పహారా కాసేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. నదిలో మూడు మునకలే అన్నట్లుగా ఎక్కువ సేపు ఎవరికి నదిలో ఉండనీయడం లేదు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు స్నానానికి దిగే సమయంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు వారిని వెయ్యి కళ్లతో పరిశీలిస్తూ ప్రతి క్షణం విజిల్స్ ఊదుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి కంటే శనివారం నదిలో నీటిమట్టం సుమారు ఒక అడుగు మేర పెరగడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నదిలో బ్యారికేడ్ వరకు ఎవరిని అనుమతించడం లేదు. ముఖ్యంగా నీటితో ఆటలాడే యువతి, యువకులను వెళ్లకుండా చూస్తున్నారు.