అమ్మాయిలను అమ్మి.. వంద కోట్ల సంపాదన!
అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసి, వారితో వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న ఓ జంటతో పాటు ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై అత్యంత కఠినమైన మోకా చట్టం కింద కేసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిషా, కర్ణాటక, అసోం రాష్ట్రాలు.. ఇంకా నేపాల్ నుంచి దాదాపు 5వేల మంది అమ్మాయిలను హుస్సేన్ (50), సైరా (45) అనే ఇద్దరూ ఢిల్లీకి అక్రమంగా తరలించేవాళ్లు. రూ. 50 వేలకు అమ్మాయిని కొనడం, తర్వాత వాళ్లను రూ. 2 లక్షలకు అమ్మేయడం.. ఈ వ్యాపారంతో ఇప్పటికి దాదాపు వంద కోట్లు ఆర్జించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అమ్మాయి వయసు ఎంత తక్కువైతే వీళ్ల ఆదాయం అంత ఎక్కువగా ఉండేది.
తాము కొన్న అమ్మాయిలను ఇంట్లోని అల్మారాలలోను, సొరంగాలలోను దాచిపెట్టి ఉంచేవాళ్లని, చిన్న చిన్న క్యూబికల్స్‌లో ఉన్న విటుల వద్దకు బలవంతంగా పంపేవారని జాయింట్ కమిషనర్ (క్రైం) రవీంద్ర యాదవ్ తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని, ఈ రాకెట్‌లో మరింతమంది ఉండొచ్చని ఆయన అన్నారు. హుస్సేన్ డ్రైవర్ రమేష్, చీఫ్ మేనేజర్ వాసులను కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. వాళ్లతోపాటు శంషద్, శిల్పి, ముంతాజ్, పూజా థాపా అనే నలుగురు అమ్మాయిలను హ్యాండిల్ చేసే 'నాయికలు'గా ఉండేవారు. వాళ్లు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం రాకెట్‌ను సైరాబేగం నడిపించేదని, ఇందులో పై నుంచి కిందివరకు నాయికలు, పెయిడ్ మేనేజర్లు, వాళ్ల అసిస్టెంట్లు, అమ్మాయిలను అక్రమంగా తీసుకొచ్చేవాళ్లు.. ఇలా అంతా ఉండేవాళ్లని ఓ పోలీసు అధికారి తెలిపారు. దీనివెనుక చాలా పెద్ద క్రైం సిండికేట్ ఉందని అన్నారు.