వరుస రేప్లతో అమ్మాయిల ఆందోళన
బరేలి: ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న వరుస అత్యాచారాలతో అమ్మాయిలు హడలిపోతున్నారు. ఢిల్లీ- కాన్పూర్ హైవేపై కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, తల్లీకూతుళ్లపై దుండగులు గ్యాంగ్ రేప్ చేయడం.. బరేలి జిల్లాలో 24వ హైవేకు సమీపంలో ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడం.. ఈ రెండు ఘటనలు నాలుగు రోజుల వ్యవధిలో జరగడంతో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బరేలి జిల్లాలో కొందరు అమ్మాయిలు ఆకతాయిల చేష్టలకు భయపడి కాలేజీకి వెళ్లడం మానేశారు. తమకు భద్రత కల్పించే వరకు కాలేజీ వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. ఓ కాలేజీకి చెందిన దాదాపు 50 మంది విద్యార్థినులు పోలీసు స్టేషన్కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ధనేలి, ఔరంగాబాద్ గ్రామాల విద్యార్థినులు, తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వెళ్లి షాహి పోలీసులను కలిశారు. స్థానిక యువకులు తమపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కాలేజీ విద్యార్థినుల సమస్య తమ దృష్టికి వచ్చిందని, వారి భద్రత కోసం కాలేజీకి వెళ్లే దారిలో పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు మఫ్టీ దుస్తుల్లో పోలీసులను మోహరిస్తామని బరేలి డీఐజీ ఆశుతోష్ కుమార్ చెప్పారు. అమ్మాయిలకు భద్రత కల్పించాలని కోరుతూ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఎస్పీకి లేఖ రాశారు.