'హోదా తొలగింపు'పై అల్లుడి స్పందన
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ప్రత్యేక సౌకర్యాలు పొందే వీవీఐపీల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తొలిసారి స్పందిచారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీఐపీ హోదా తొలగింపు తనకెంతో ఆనందాన్నిచ్చిందని, అందుకు ధన్యుడినని వ్యాఖ్యానించారు.
'ఇప్పుడు నేను వీఐపీని కాను. ప్రభుత్వం నాకు ప్రత్యేక హోదాను తొలిగించడం సంతోషం. ఆ హోదాను నేనెప్పుడు కోరుకోలేదు. ఇన్నాళ్లకైనా దానికి దూరంగా ఉండాల్సిరావడం ఆనందకంరం. నిజానికి నాకా హోదా వద్దని గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశాను' అని రాబర్ట్ వాద్రా చెప్పుకొచ్చారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, చీఫ్ జస్టీస్లు, ముఖ్యమంత్రులు, దౌత్యాధికారులు తదితర ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎయిర్పోర్టుల్లో ఎలాంటి తనిఖీలు నిర్వహించరు. వారేకాక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లోకి వచ్చేవారు, అధికార పక్షానికి అత్యంత ఆప్తులు కూడా ఈ హోదాను పొందడం పరిపాటి.
అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిర్పోర్టుల్లో వీవీఐపీలకు అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాలపై సరికొత్త నిబంధనలు రూపొందించారు. ఆ క్రమంలోనే అధికార పదవుల్లోలేని రాబర్ట్ వాద్రా లాంటి కొందరికి హోదాను తొలిగిస్తున్నట్లు మూడు నెలల కిందట పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. హోదా తొలగించిన వీవీఐపీల జాబితాను అన్ని ఎయిర్ పోర్టుల్లో ఉంచింది. కేవలం సోనియా గాంధీ అల్లుడు అయినందుకే రాబర్ట్ వాద్రాకు వీవీఐపీ హోదా కల్పిస్తున్నారని అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.