మూడు రెట్లు పెరిగిన జీఎంఆర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా నష్టాలు మూడు రెట్లు పెరిగాయి. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి జీఎంఆర్ రూ.2,635 కోట్ల ఆదాయంపై రూ. 326 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.2,601 కోట్ల ఆదాయంపై రూ.94 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. వ్యయాలు భారీగా పెరగడం ఇదే సమయంలో పెరిగిన రుణభారాలు నష్టాలు పెరగడానికి ప్రధాన కారణంగా జీఎంఆర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో వడ్డీ చెల్లింపులు రూ.480 కోట్ల నుంచి రూ.610 కోట్లకు పెరిగింది. జడ్చర్ల హైవే ప్రాజెక్టులో వాటాలు విక్రయం, ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఆదాయంలో వృద్ధి, కొత్తగా రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో మొత్తం ఆదాయంలో వృద్ధికి కారణాలుగా కంపెనీ పేర్కొంది.
టాఫిక్ పెరుగుతుండటం హర్షణీయం
ఫలితాలపై జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎం రావు స్పందిస్తూ ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ట్రాఫిక్ పెరుగుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగదు సరఫరా ఎక్కువగా ఉండే వ్యాపారాలపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు టారిఫ్‌లను పునఃపరిశీలించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.