జీఎంఆర్ ఎయిర్‌పోర్టులు ఇక ప్రత్యేక కంపెనీ!
లిస్టింగ్ కోసం సన్నాహాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల వ్యాపారాన్ని విడదీయడంతోపాటు వేరుగా లిస్టింగ్ చేసే పనిలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా నిమగ్నమైనట్టు సమాచారం. ఈ మేరకు రుణదాతల నుంచి అనుమతి కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను జీఎంఆర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సైతం సంస్థ ఖాతాలోనే ఉంది. ఉత్తర గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టును చేజిక్కించుకుంది కూడా. అయితే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ను రూ.20,000 కోట్లుగా విలువ కట్టాలని జీఎంఆర్ ఇన్‌ఫ్రా భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీకి విలువ చేకూర్చడంతోపాటు రుణ భారం తగ్గించుకోవాలన్నది సంస్థ ఆలోచన.
ఎయిర్‌పోర్ట్స్ విభాగాన్ని విడదీయడం, లిస్టింగ్ వార్తలను సంస్థ ఖండించింది. అయితే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిస్టింగ్ చేయనున్నట్టు గతంలోనే కంపెనీ తెలిపింది. జీఎంఆర్ ఇన్‌ఫ్రా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.9,271 కోట్లుగా ఉంది. ఎయిర్‌పోర్ట్స్ విభాగంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు 97 శాతం వాటా ఉంది. బీఎస్‌ఈలో జీఎంఆర్ షేరు శుక్రవారం ముగింపు ధర రూ.14.39. సోమవారం రూ.14.50 దగ్గర ప్రారంభమై తాజా వార్తల నేపథ్యంలో రూ.15.82 దాకా వెళ్లిన షేరు, చివరకు రూ.15.36 దగ్గర స్థిరపడింది.