హైదరాబాద్: నిర్దిష్ట మైలురాళ్లను సాధించిన తర్వాత సమీప భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్స్ విభాగాన్ని లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అదానీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ జీత్ అదానీ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో ఉన్న విమానాశ్రయాలను విస్తరిస్తున్నామని, గతేడాది అన్ని ఎయిర్‌పోర్ట్‌ల నుంచి 8 కోట్ల మంది ప్యాసింజర్లు ప్రయాణించినట్లు ఆయన చెప్పారు.
లక్నో, గువాహటి ఎయిర్‌పోర్ట్‌లలో కొత్త టెర్మినల్స్‌ను ప్రారంభించనున్నామని, నవీ ముంబై విమానాశ్రయం ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని చెప్పారు. అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. భారత నేవీ కోసం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తయారు చేసిన దృష్టి 10 స్టార్‌లైనర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమంలో జీత్ పాల్గొన్నారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్‌ఎల్) మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, తిరువనంతపురం, ముంబై తదితర విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (ఎంఐఏఎల్) 73% వాటా ఉంది. ఎంఐఏఎల్‌కు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 74% వాటాలు ఉన్నాయి. ప్రయాణికుల పరంగా 25% వాటా, ఎయిర్ కార్గో ట్రాఫిక్‌లో 33% వాటాతో ఏహెచ్‌ఎల్ దేశీయంగా అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రా సంస్థగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment