గెలిచిన 5 రోజులకే రాజీనామా..!
పణాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె.. పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు రోజులకే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. గత అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. విశ్వజిత్ తండ్రి ప్రతాప్ రాణె గోవా ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేశారు.
గురువారం గోవా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బలపరీక్షలో విశ్వజిత్ పాల్గొనలేదు. సభ నుంచి వాకౌట్ చేసిన విశ్వజిత్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజా ఎన్నికల్లో వాల్పోయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వజిత్.. మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసి ప్రజాభిప్రాయాన్ని కోరుతానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పిన రాణె.. బీజేపీలో చేరే విషయాన్ని తోసిపుచ్చలేదు.
40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ కాంటె కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. గోవాలో అధికార బీజేపీ 13 సీట్లకే పరిమితం అయినా చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని రాణె నిందించారు.