పసిడిపై సుంకాలు మరింత పెంపు
పసిడిపై సుంకాలు మరింత పెంపు
Published Tue, Aug 13 2013 1:10 AM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM
న్యూఢిల్లీ: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) కట్టడికి కేంద్రం సోమవారం మరిన్ని చర్యలు ప్రకటించింది. వీటి కారణంగా బంగారం, వెండి, నిత్యావసరం కాని వస్తువుల దిగుమతులపై సుంకాలు మరింత పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కస్టమ్స్ నోటిఫికేషన్లను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయసభల్లో ఈ మేరకు ప్రకటనలు చేసిన అనంతరం ఆర్థిక మంత్రి పి. చిదంబరం మీడియాకు ఈ విషయాలు చెప్పారు. అయితే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, సుంకాల పెంపు ఎంత మేర ఉంటాయన్నది సభ వెలుపల వెల్లడించలేనని ఆయన తెలిపారు. ఈ చర్యలతో క్యాడ్ 3.7%కి(70 బిలియన్ డాలర్లు) కట్టడి కాగలదని ఆయన తెలిపారు. పసిడి, చమురు దిగుమతుల భారంతో 2012-13లో క్యాడ్ ఆల్‌టైం గరిష్టమైన 4.8 శాతానికి ఎగిసింది. విదేశీ రుణాల నిబంధనలు సడలించడంతో ఈ ఏడాది అదనంగా 11 బిలియన్ డాలర్ల నిధులు తరలిరావొచ్చని చిదంబరం చెప్పారు.
చమురు సంస్థలకు విదేశీ రుణాలు..
పెట్టుబడులను పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు విదేశీ వాణిజ్య రుణ (ఈసీబీ) రూపంలో దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించేందుకు అనుమతించినట్లు చిదంబరం పేర్కొన్నారు. దీని ప్రకారం ఐవోసీ 1.7 బిలియన్ డాలర్లు, బీపీసీఎల్.. హెచ్‌పీసీఎల్ చెరి 1 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించుకోవచ్చు. మరోవైపు మౌలిక రంగ రుణ అవసరాల కోసం ఐఆర్‌ఎఫ్‌సీ, పీఎఫ్‌సీ, ఐఐఎఫ్‌సీఎల్ కలిసి క్వాసీ-సావరీన్ బాండ్ల ద్వారా 4 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించేందుకు అనుమతించనున్నట్లు చిదంబరం తెలిపారు. ఐఐఎఫ్‌సీఎల్, పీఎఫ్‌సీ చెరి 1.5 బిలియన్ డాలర్లు, ఐఆర్‌ఎఫ్‌సీ 1 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రుణాలు సమీకరించవచ్చన్నారు. భారత్‌లో బహుళజాతి సంస్థల అనుబంధ కంపెనీలు తమ మాతృసంస్థల నుంచి నిధులు పొందేందుకు వీలు కల్పిస్తూ ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేస్తుందని చిదంబరం చెప్పారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు జారీ చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లలోసావరీన్ వెల్త్ ఫండ్స్ సుమారు 30 శాతం దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్స్ నిబంధనల సడలింపు..
నాన్ రెసిడెంట్ డిపాజిట్ పథకాల (ఎన్‌ఆర్‌ఈ/ఎఫ్‌సీఎన్‌ఆర్) వడ్డీ రేట్లపై నియంత్రణ ఎత్తివేస్తున్నట్లు చిదంబరం వివరించారు. ఎఫ్‌సీఎన్‌ఆర్ అకౌంట్లకు సంబంధించి మూడేళ్లు, అంతకు పైబడిన కాల వ్యవధికి సంబంధించిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను డీరెగ్యులేట్ చేస్తున్నట్లు చిదంబరం తెలిపారు.
Advertisement
Advertisement