ఆర్టికల్ 370 రద్దుపై విస్తృత చర్చ!
* వివాదానికి తెరతీసిన పీఎంఓ మంత్రి వ్యాఖ్యలు
* మండిపడ్డ ఒమర్, పీడీపీ
* వివరణ ప్రకటన విడుదల చేసిన జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ/శ్రీనగర్: ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన కార్యాలయూనికి (పీఎంఓ) చెందిన ఓ మంత్రి వివాదానికి తెరతీశారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని అధికరణం 370 రద్దుకు సంబంధించి పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రతిపక్ష పీడీపీ ఆగ్రహానికి కారణమయ్యూయి. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సింగ్ అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆర్టికల్ 370 రద్దుకు అంగీకరించని వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ అంశంలోని మంచిచెడులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరినీ సంప్రదించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ అంశంపై బీజేపీ పూర్తిగా వృత్తిపరమైన నైపుణ్యంతో వ్యవహరిస్తోందని, కాశ్మీర్ లోయలో సమావేశాలు నిర్వహిస్తోందని వివరించారు. కొందరికి నచ్చజెప్పడంలో (ఆర్టికల్ 370 రద్దుపై) సఫలీకృతులమయ్యూమని కూడా చెప్పారు.
మంత్రి వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. రాష్ట్రానికి, మిగతా దేశానికి మధ్య ఉన్న ఏకైక రాజ్యాంగపరమైన సంబంధం ఆర్టికల్ 370 ఒక్కటేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘రాసి పెట్టుకోండి.. అంతేకాదు ఈ ట్వీట్‌ను సేవ్ కూడా చేసుకోండి. మోడీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయినా.. 370 ఉన్నంత కాలం కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉంటుంది. అది లేకపోతే ఉండదు ’ అంటూ తీవ్రంగా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై వ్యాఖ్యలు చేసిన జితేంద్ర సింగ్‌కు ప్రధాని, బీజేపీ నాయకత్వం కళ్లెం వేయూలని పీడీపీ సూచించింది.
వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక మంత్రి మరో ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను మీడియూ తప్పుగా చిత్రీకరించిందన్నారు. ప్రధానమంత్రిని ఉటంకిస్తూ ఆర్టికల్ 370పై తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం ఇదంత ప్రాధాన్యత లేని వివాదంగా పేర్కొనేందుకు ప్రయత్నించింది. ‘దీనిపై మేమో నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల ప్రచారంలో మేమేం చెప్పామో మీరు చూశారు. ప్రభుత్వం దీనిపై నిర్మాణాత్మక దృక్పథాన్ని అనుసరిస్తుంది..’ అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.