న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు శుభవార్త.వారికి చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) ఏడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతమున్న డీఏను వంద శాతం నుంచి 107 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తాజా పెంపుతో దాదాపు 30 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, మరో 50 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. యూపీఏ ప్రభుత్వం చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న డీఏను 90 శాతం నుంచి నూరు శాతానికి పెంచింది. ఆ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ నూతన డీఏ పెంపు ఎనిమిది నెలలపాటు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఉద్యోగులకు, పింఛన్ దారులకు వర్తించనుంది.