సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో అడ్డగోలు బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. ప్రభుత్వానికి ఉన్న విశేష అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీ సంఖ్యలో ఉపాధ్యాయ బదిలీలకు ముఖ్యమంత్రి కార్యాలయమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులను బదిలీ చేసిన ప్రభుత్వం భారీ సంఖ్యలో మరిన్ని బదిలీలకు ఖాళీల పరిస్థితి గురించి అధికారిక సమాచారాన్ని (రిమార్క్సు) కోరింది. ‘సర్క్యులేట్ ది ఫైల్ అంటూ..’ అటు సీఎంఓ.. ఇటు సెకండరీ విద్యాశాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు ఇస్తుండటంతో సచివాలయంలో సెకండరీ విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది.. పాఠశాల విద్యా డెరైక్టరేట్‌లో సిబ్బంది బిజీ అయ్యారు.
రిమార్క్సు ఫైళ్ల కోసం వచ్చిపోయే ఉపాధ్యాయులు, దళారులు, ప్రజాప్రతినిధులతో కార్యాలయాల్లో హడావుడి నెలకొంది. ఇప్పటి వరకు 500 మందికిపైగా టీచర్ల బదిలీలకు క్షేత్ర స్థాయి నుంచి రిమార్క్సు తెప్పించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ.. అర్హులైన వారికి అన్యాయం చేస్తూ.. పైరవీ, పరపతి ఉన్న వారికే విశేషాధికారంతో బదిలీలు చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు దక్కాల్సిన స్థానాలను కొందరు పైరవీలతో ఎగరేసుకుపోతుండటంతో ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.
నిషేధ సమయంలోనూ కసరత్తు: రాష్ట్ర ప్రభుత్వం అడపాదడపా బదిలీలు చేస్తూనే.. మరోవైపు ఇష్టారాజ్యంగా అధిక సంఖ్యలో టీచర్ల బదిలీలకు కసరత్తు చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల నుంచి వచ్చిన సిఫారసులకు ప్రాధాన్యం ఇచ్చి దొడ్డిదారి బదిలీల ప్రక్రియను వేగవంతం చేస్తోంది. సీఎంఓ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేసి అడ్డగోలు బదిలీల కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ముఖ్యమైన స్థానాలను అనర్హులు తన్నుకు పోయేందుకు సిద్ధం అయ్యారు. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి అన్యాయం జరుగనుంది.
దళారుల వసూళ్ల పర్వం
ముఖ్యమైన ప్రాంతాల్లోకి బదిలీలు కోరుకుంటున్న టీచర్లతో ప్రజాప్రతినిధుల అనుచరులు, దళారులు బేరాలు కుదుర్చుకుంటుండటంతో పట్టణ ప్రాంతాల్లోని ముఖ్యమైన స్థానాలు భారీగా గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు రూ.లక్ష, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు లక్షన్నర చొప్పున ముట్టజెప్పాలని ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.
కౌన్సెలింగ్ విధానానికి పాతర
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ విధానం ఉన్నా ప్రభుత్వమే దాన్ని తుంగలో తొక్కుతోంది. దీంతో ఎలాంటి రవాణా సదుపాయం లేని ఏజె న్సీ, మారుమూల గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సాధారణ బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా ప్రాధాన్యం ఇచ్చేందుకు కేటాయించే అదనపు పాయింట్లకు విలువ లేకుండా పోతోంది. అడ్డగోలు బదిలీలతో అలాంటి టీచర్లకు మంచి స్థానాలు లేకుండా చేస్తోంది. వేల మంది టీచర్లు ప్రస్తుతం రవాణా సదుపాయంలేని గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారు.
త్వరలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్‌లో అలాంటి వారికి విద్యా శాఖ మొదటి ప్రాధాన్యం ఇచ్చి పట్టణాలకు సమీప ప్రాంతాల్లోని స్కూళ్లకు బదిలీ చేసి న్యాయం చేయాలి. కాని ప్రాధాన్య పోస్టులన్నీ అడ్డదారి బదిలీల్లో పోనుండటంతో అర్హులకు అన్యాయం తప్పేలా లేదు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, వాటికి సమీపంలో ఉండే మంచి స్థానాలన్నీ అడ్డగోలు బదిలీల్లో పైరవీ చేసే టీచర్లు దక్కించుకోనుండటంతో అర్హత కలిగిన టీచర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.