'గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేస్తాం'
న్యూఢిల్లీ : సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమన్న గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కేంద్రమంత్రి నారాయణ స్వామి తెలిపారు. ఈ అంశంపై ప్రధానమంత్రి, న్యాయ శాఖ మంత్రులలో చర్చించనున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయాలతో ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామన్నారు. మరోవైపు ఈ అంశంపై అప్పీలుకు వెళతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. సోమవారం సుప్రీంలో అప్పీలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
భారత దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’(సీబీఐ) ఏర్పాటే అసలు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఐ.ఎ.అన్సారీ, జస్టిస్ ఇందిరా షాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఓ రిట్ పిటిషన్‌పై ఆదేశాలు జారీచేస్తూ ఈ మేరకు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.