15 ప్రభుత్వ రంగ సంస్థలు క్లోజ్
తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న 15 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ : తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న 15 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఐదు యూనిట్ల మూతకు ఇప్పటికే కేబినెట్ ఆమోదముద్ర వేయగా.. మూడు సంస్థలను కంపెనీ అంతర్గత సలహాలతో క్లోజ్ చేయనున్నారు. ఖాయిలా పడిన మిగతా అరడజను కంపెనీలను నీతి ఆయోగ్ గుర్తించింది. కానీ వాటి భవితవ్యంపై కొంత సందిగ్థత నెలకొంది. కొన్ని మంత్రిత్వ శాఖలు సంస్థలను మూసివేసే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా.. మరికొన్ని శాఖలు ఈ ప్ర్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. హెచ్పీసీఎల్ ఆధీనంలో నడుస్తున్న బయోఫ్యూయల్ లిమిటెడ్ మూతకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నష్టాల బాట పట్టిన బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్, ఎల్గిన్ మిల్స్ మూత వ్యవహారాన్ని టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకొచ్చింది.
మరికొన్ని మంత్రిత్వ శాఖలు నష్టాలను మూటగడుతున్న సంస్థలను నడపడం కంటే మూసివేయడమే మంచిదిగా నిర్ణయిస్తున్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ వాఖ, కొన్ని హెచ్ఎమ్టీ సంస్థలను క్లోజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ను మూసేవేసే ప్రతిపాదనకు కేబినెట్ నిర్ణయానికి అనుకూలంగా నడుచుకోవాలని షిప్పింగ్ శాఖ కూడా నిర్ణయించింది. పీఎస్యూలను మూయడం సీరియస్ విషయంగా పరిగణించిన కేంద్రప్రభుత్వం ముందస్తుగానే ఆయా శాఖల నిర్ణయాలను సేకరించింది.
పీఎస్యూల మూతకు సంబంధించిన ప్రతిపాదనలను నీతిఆయోగ్ చేపట్టింది. దీనికి సంబంధించిన తన ప్రతిపాదనలను నీతిఆయోగ్ ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నృపేంద్ర మిశ్రాకు సమర్పించింది. మొత్తం 74 ప్రభుత్వ రంగ సంస్థల మూతకు నీతి ఆయోగ్ ప్రతిపాదించగా.. ఆయా మంత్రిత్వశాఖలతో మిశ్రా వివిధ సమావేశాల అనంతరం 15 సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థల జాబితాను నీతి ఆయోగ్ రెండు వర్గాలుగా విభజించింది. దానిలో ఒకటి జాబితా సంస్థలను మూసివేయడానికి ప్రతిపాదించగా.,.. మరో జాబితాలో ప్రభుత్వం తన వాటా పెట్టుబడులను ఉపసంహరించుకునేలా సిపారసు చేసింది.