యూపీలో రగులుతున్న అసమ్మతి!
టికెట్ పంపకాలపై బీజేపీలో అసంతృప్తి.. ఆరెస్సెస్ గుస్సా
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో టికెట్ పంపకాలపై బీజేపీలో అసమ్మతి రగులుతోంది. టికెట్ పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ బీజేపీ, ఆరెస్సెస్‌లోని ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య దిష్టిబొమ్మలు తగలబెట్టడం, లక్నోకు వస్తుండగా షా వాహనాన్ని అడ్డుకోవడం, ఫైజాబాద్ బీజేపీ ఎంపీని, జిల్లా అధ్యక్షుడిని అయోధ్యలో కార్యకర్తలు గృహనిర్బంధం చేయడం.. ఈ అసమ్మతి సెగలకు తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తోంది. పార్టీ శ్రేణుల నుంచి ఇంతటి తిరుగుబాటు చర్యలను ఎప్పుడూ చూడలేనది పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఆరెస్సెస్‌కు యూపీలో ఆరు రాష్ట్ర యూనిట్‌లు ఉన్నాయి. ఇందులో నాలుగు యూనిట్లు టికెట్ల పంపకాల్లో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర అసమ్మతి వ్యక్తం చేసినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ శ్రేణులను విస్మరించి.. ఇతర పార్టీలనుంచి వచ్చిన బయటి వ్యక్తులకు, నేతల బంధుగణానికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చారంటూ ఆరెస్సెస్ గుస్సా అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్, ఆరెస్సెస్-బీజేపీ సమన్వయ ఇన్‌చార్జి కృష్ణగోపాల్ అసమ్మతి వర్గాలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా.. అది సఫలం కావడం లేదని తెలుస్తోంది.
జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ గెలుపునకు కృషి చేయాలని వారు చెప్తున్నా.. ఆ వర్గాలు వినే ప్రసక్తి లేదని సమాచారం. తూర్పు యూపీ ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శివ్ నారాయణ్ బీజేపీ అభ్యర్థులతో సమావేశానికి నిరాకరిస్తున్నట్టు సమాచారం. ఆయన పరిధిలో 263 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషీ తన నియోజకవర్గంలో సహకరించాల్సిందిగా కసోరుతూ శివ్‌నారాయణ్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది.
టికెట్ల కేటాయింపులో బీజేపీ తమ సలహాను తీసుకున్నా.. దానిని ఏమాత్రం పాటించలేదని, మొదట పార్టీ శ్రేణులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని, ఆ తర్వాత బయటి వ్యక్తులకు, నేతల బంధుగణాలకు టికెట్లు ఇస్తామని చెప్పిన ఆ పార్టీ.. చివరకు దానికి పూర్తి విరుద్ధంగా పనిచేసిందని ఆరెస్సెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆరెస్సెస్ నుంచి, బీజేపీలోని అసమ్మతి వర్గాల నుంచి ఇలా నిరసనజ్వాలలు ఎగిసిపడుతుండటంతో బీజేపీ అధినాయకత్వానికి కొంత తలనొప్పిగా మారింది. ఈ అసమ్మతిని చల్లార్చేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.